జ‌గ‌న్‌ స‌ర్కారుపై తిరుగుబాటు.. రేష‌న్ వాహ‌నాలు రిటర్న్స్..

అంత‌న్నారు. ఇంత‌న్నారు. ఇంటి ద‌గ్గ‌రికే నిత్యావ‌స‌రాల పంపిణీ అన్నారు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఆహో, ఓహో అంటూ ఊద‌ర‌గొట్టారు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. క‌ట్ చేస్తే.. రేష‌న్ వాహ‌నాల ఆప‌రేట‌ర్లు నిండా మునిగారు. లాభ‌మే రాక‌, న‌ష్టాలే మిగిలాయి. అందుకే, ఇక త‌మ వ‌ల్ల కాదంటూ.. ఇలాంటి ప‌నికి మాలిన ప‌థ‌కాల‌తో తాము రోడ్డున ప‌డ్డామంటూ స‌ర్కారుపై తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇచ్చిన రేష‌న్ వాహ‌నాల‌ను ఆప‌రేట‌ర్లు స‌ర్కారుకే తిరిగిచ్చేస్తున్నారు. ఆ ప‌థ‌కంలోని డొల్ల త‌నం.. ఆ ఆప‌రేట‌ర్ల‌ను అప్పుల పాలు చేస్తోంది. 

ఇంటి వద్దకు నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది వాహన ఆపరేటర్లు ఉన్నారు. వారిలో 10 మంది తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. నెల‌కు తమకు వస్తున్న రూ.21 వేలు ఏ మూల‌కూ స‌రిపోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చిందంతా.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం లేదని ఆపరేటర్లు ఆందోళ‌న వెలిబుచ్చుతున్నారు. 

తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరి చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాహనాలను తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనం తీసుకునే సమయంలో తాము రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని.. దాన్ని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు. ఇలా.. స‌రైన లాభ‌దాయ‌క‌మైన‌ విధాన‌మంటూ లేకుండా ఆర్బాటంగా ప్ర‌వేశ‌పెట్టిన ఇంటింటి రేష‌న్ కార్య‌క్ర‌మం ఆప‌రేట‌ర్ల నిరాక‌ర‌ణ‌తో అబాసుపాల‌వుతోంది. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ విధానాలు మ‌రోసారి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.