తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి కన్నుమూత
posted on Oct 15, 2025 5:32PM

తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి అనారోగ్యంతో కన్నుమూత మూశారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరేళ్ల వయసులోనే పాటల ప్రపంచంలో అడుగుపెట్టిన బాల సరస్వతి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2,000కి పైగా పాటలు పాడారు.1939లో విడుదలైన ‘మహానంద’ చిత్రంతో తెలుగులో తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితమయ్యారు.
సతీ అనసూయ’ చిత్రంలోని తొలి పాటతో తెరపైన సువర్ణ అధ్యాయం ప్రారంభించిన బాల సరస్వతి, 1930 నుంచి 1960 దశకాల వరకూ ఎన్నో మధుర గీతాలు ఆలపించి, కొన్ని చిత్రాల్లో నటించి కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె స్వరాలు తెలుగు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. బాలసరస్వతి దేవి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన చెందారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.