కోర్టులో మళ్లీ చుక్కెదురు.. మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి
posted on Jul 25, 2025 11:08AM
.webp)
ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోఉండక తప్పదు. కా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవనీ, కోర్టు ఆదేశాల్లో ఉన్న మార్గదర్శకాలను పునః పరిశీలించాలని ఆయన ఆ రివ్యూ పిటిషన్ లో కోరారు. జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నా, లేదా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే తప్ప ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం లేదని, అటువంటి పరిస్థితుల్లో జైలులో ఉన్న సహాయ సిబ్బందిని ఉపయోగిస్తామని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో ఎంపీకి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల 29న జరిగే విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది.