వయనాడ్ లో రాహుల్ కార్యాలయంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం

రాజకీయ ప్రత్యర్థులపై, వారి కార్యాలయాలు, ఆస్తులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. భిన్న అభిప్రాయాన్ని సహించలేని అసహనం దేశంలో పెరిగిపోతున్నది.  కేరళలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడి ఈ కోవలోకే వస్తుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,  అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  కార్యాల‌యంపై  గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు శుక్ర‌వారం దాడికి పాల్పడ్డారు.

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వ‌య‌నాడ్‌లో ఆయ‌న త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాల‌యంపై శుక్ర‌వారం  కొంద‌రు వ్య‌క్తులు  దాడికి పాల్పడి కార్యాల‌యంలోని సామగ్రి ధ్వంసం చేశారు. ఈ దాడిని కాంగ్రెస్  తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి చెందిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైర‌ల్ అయ్యాయి. కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వ‌మే ఈ దాడికి బాధ్య‌త వ‌హించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

కేర‌ళ పోలీసుల క‌ళ్లెదుటే దుండ‌గులు దాడికి దిగార‌ని  కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.  ఈ దాడి వెనుక సీపీఎం హస్తం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.  

దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్ప‌డ్డ వారిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  డిమాండ్ చేశారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని   కేర‌ళ స‌ర్కారును కోరారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను కాంగ్రెస్ పార్టీ స‌హించ‌బోద‌ని హెచ్చ‌రించారు.