కల్మా చదువుతున్న రాహుల్.. చేతులు జోడించిన పీవీ.. వైరల్ అవుతున్న ఫొటో

కొందరిని కొంతకాలం నమ్మించవచ్చు. కానీ అందరినీ అన్ని కాలాల్లోనూ ఎవరూ నమ్మించలేరు. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును వెెంటాడుతున్న అనేక అంశాల్లో నమ్మకం కూడా ఒకటి. గాంధీ ఫ్యామిలీ మీద ఇప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వారు పేరుకు మాత్రమే హిందువులని, అందులోనూ బ్రాహ్మణులుగా క్లెయిమ్ చేసుకుంటారు తప్పించి వారు అనుసరిస్తున్నది మాత్రం ఇస్లామిక్ సంప్రదాయాన్నే అంటూ చాలామంది భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే వారి రాజకీయ ఉపన్యాసాలు, వ్యవహార శైలి కూడా ఉంటాయి. అయితే అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాత ఫొటో ఒకటి మరోసారి తెరమీదికొచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత ఆమె అంతిమక్రియల సందర్భంగా ఇస్లామిక్ సంప్రదాయాన్ని అనుసరించి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కల్మా చదివారని.. ఆ పక్కనే ఉన్న పీవీ నరసింహారావు మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నారని.. దీన్నిబట్టి ఎవరు హిందూ, ఎవరు ముస్లిమో గ్రహించవచ్చంటూ గాంధీ ఫ్యామిలీ నిగూఢ సంప్రదాయం గురించి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరేమో అసలు ఈ ఫొటోనే ఫేక్ అని, రాజీవ్, రాహుల్ ఎప్పుడూ కల్మా చదువలేదని కామెంట్లు చేశారు. 

అయితే ఈ వివాదానికి తెలుగువన్ డాట్ కామ్ తెర దించాలని పూనుకుంది. పాఠకులకు క్లారిటీ ఇవ్వదలచుకొని ప్రత్యేకంగా సెర్చ్ చేసింది. ఈ పరిశోధనలో ఆ ఫొటో వాస్తవమేనని, దానికి మార్ఫింగ్ లాంటివేవీ జరగలేదనేది స్పష్టంగా తేలిపోయింది. అయితే అది ఇందిరాగాంధీ అంత్యక్రియల ఫొటో కాదని, సరిహద్దు గాంధీగా పేరున్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంత్యక్రియల సందర్భంగా తీసిన ఫొటోగా తేలింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు, గాంధీకి, నెహ్రూ కుటుంబానికి సన్నిహిత సంబంధాలుండేవి. దేశ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం. అయితే దేశవిభజనలో భాగంగా ఆయన ప్రాంతం పాకిస్తాన్ లో కలిసిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయిన నాలుగేళ్ల తరువాత అంటే 1988లో సరిహద్దు గాంధీ పెషావర్ లో చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు నాటి ప్రధాని రాజీవ్, సోనియా, రాహుల్, పీవీ నరసింహారావు హాజరయ్యారు. రాజీవ్ స్వీడన్ పర్యటనలో భాగంగా పెషావర్ లో దిగి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు నివాళులు అర్పించారు. దీంతో ఆ ఫొటో ఇందిరాగాంధీ అంత్యక్రియలనాటిది కాదని స్పష్టంగా తేలిపోయింది. 

అయితే అంత్యక్రియల సంగతి ఇందిరాగాంధీది కాకపోయినా రాజీవ్, రాహుల్ కల్మా చదువుతున్న మాట వాస్తవమే కదా అనే కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. నిజమే రాజీవ్, రాహుల్ ఇస్లామిక్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కల్మా చదువుతున్న విషయం క్లారిటీగా అర్థమవుతోంది. వారి పక్కనే ఉన్న పీవీ నరసింహారావు కల్మాకు బదులు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ నిలబడ్డారు. దీన్నే స్వీయ ధర్మ ఆచరణ, పర ధర్మ ఆదరణ అని పిలుస్తారు. దీన్నిబట్టి రాజీవ్, రాహుల్ స్వీయ ధర్మం ఏదో అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదని, పీవీ పట్ల సోనియా అండ్ కో ఎందుకు కక్ష కట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ ను వ్యతిరేకించే నెటిజన్ల వర్గం కోడై కూస్తోంది. 

దీనికితోడు ఎన్నికల సమయాల్లో తాను కట్టర్ హిందూవాదినని,అందులోనూ జంధ్యం ధరించిన బ్రాహ్మణుడినని రాహుల్ చెప్పుకోవడాన్ని ఎవరూ నమ్మడం లేదు. అసలాయన అలా చెప్పుకోవడాన్నే రాహుల్ హిందువు కాదన్న విషయం తేటతెల్లం చేస్తోందని, అందుకే ఓట్ల కోసం రాహుల్ అలా చెప్పుకోవాల్సి వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ శివుడి వేషం వేసినా, కృష్ణుడి వేషం వేసినా అవన్నీ ప్రజల్ని అలరించే బుడబుక్కల వేషాలే అవుతాయి తప్ప నికార్సయిన నిజం కాదంటున్నారు. ఇప్పటికే అనేక వీడియోల్లో రాహుల్ మతప్రార్థనల్లో పాల్గొనడం, హిందూస్తాన్ పతనాన్ని కాంక్షించే ఇస్లామిక్ మత ఛాందసవాదులతో కలిసి ప్రార్థనలు చేయడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 సమీపిస్తున్న దృష్ట్యా ఆ ఫొటో మరోసారి వైరల్ అవడంతో తెలుగువన్ డాట్ కామ్ దీని మీద క్లారిటీ ఇస్తోంది.