ఈ ట్రిపులార్ భలే ట్రెండీ గురూ!

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా,   వైసీపీ అధినేతను, ఆ పార్టీ నేతలను తూర్పారపడుతూనే ఉంటారు.   తాజాగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్  న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం, జరుగుతున్న పరిణామాలు, వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తన దైన స్టైల్ లో స్పందించారు.

గోరంట్ల మాధవ్ కు మద్దతిచ్చి, 500 కార్లతో ఊరేగింపుగా వైసీపీ నేతలు తీసుకెళ్తారా? అంటూ రఘురామ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాధవ్ ను స్వాగతించమేంటని నిలదీస్తున్నారు. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పిన తనను దేశ ద్రోహిగా చిత్రీకరించి, చిత్రహింసలు పెట్టి, తనను సొంత ఊరికి వెళ్లనివ్వకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న మా పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు  అఖండ స్వాగతం చెప్పేందుకు రెడీ అవడం ఏమిటని నిలదీస్తున్నారు. ఆ అశ్లీల వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ కాదని సెంట్రల్ ల్యాబ్ పరీక్షించి నిర్ధారించి చెప్పిన తర్వాత వీరోచితంగా వెళ్తే బాగుంటుందని రఘురామ అభిప్రాయపడ్డారు. గోరంట్ల మాధవ్ నిర్దోషే కావచ్చు.. కానీ ఆయన నిర్దోషి అని రుజువయ్యే వరకు ఆగలేని మీరు నన్ను ఆపేస్తారా? అంటూ రఘురామ విమర్శించారు.

మనం చేసే అభివృద్ధితో దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని జగన్ ఎప్పుడూ చెబుతుంటారని రఘురామ గుర్తుచేస్తూ.. అవును.. మాధవ్ అశ్లీల వీడియో వల్ల దేశమంతా మీ వైపే చూస్తోందంటూ జగన్ సెటైర్లు గుప్పించారు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంటే దేశమంతా మీ వైపు చూడక ఏం చేస్తుంది అని కామెంట్ చేశారు.. గోరంట్ల మాధవ్ న్యూఢ్ వీడియో కాల్ పై ప్రజల్లో గూడుకట్టుకున్న అనుమానాలను తొలగించేందుకు ప్రతిష్టాత్మక   పరిశోధన కేంద్రానికి పంపి నివేదిక తెప్పించాలని రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ కు సూచిచారు. మీకు కుదరకపోతే   తానే ప్రతిష్టాత్మక ప్రైవేట్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పిస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు.

రఘురామకృష్ణరాజు తన సతీసమేతంగా శుక్రవారంనాడు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ముర్ముకు శుభాకాంక్షలు చెప్పారు. పనిలో పనిగా తనను వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిన వైనాన్ని, పోలీసుల ఓవర్ యాక్షన్ గురించి, గోరంట్ల మాధవ్ వ్యవహారంపైన రాష్ట్రపతికి వివరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్ తల్లి, వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కారు టైర్లు పంక్చర్ అయిన వైనం పైనా రఘురామ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సీఎం తల్లికి సంబంధించింది కాబట్టి కారు ప్రమాదంపై జగన్ స్పందించాలని కోరారు. ఆమె ప్రయాణించిన కారు రెండు టైర్లు ఒకేసారి పంక్చర్ అవడం వెనక కుట్ర ఏమైనా ఉందా అన్నది  తేల్చాలనేది రఘురామ డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ జగన్ మాట్లాడిన వైనాన్ని రఘురామ ప్రస్తావించి, ఇప్పడు జగన్   హయాంలో  ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై 2 వేల కోట్ల అదనపు భారం మోపేందుకు సీఎం సిద్ధం కావడాన్ని తప్పుపట్టారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో కొనసాగించేలా చూడాలని పార్లమెంటులో కోరినందుకు తనపై అనర్హత వేటు వేయాలని చూశారని రఘురామ ఎత్తి పొడిచారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లేందుకు స్థానిక ఎంపీగా రైలులో బయలుదేరిన రఘురామ మార్గ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోవడం సంచలనం అయింది. తనను చంపేందుకు రైలులో కొందరు అనుసరిస్తున్నారంటూ రఘురామ అప్పుడు చేసిన ఆరోపణలు దుమారం లేపాయి. మొత్తానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడేందుకు, విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉంటున్నారు. తద్వారా నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నారు.