మనుషుల్ని భయపెట్టే కుందేళ్లున్నాయి.. ఎక్కడంటే?

కుందేలు అనగానే భయంభయంగా చూసే చూపులు గుర్తుకొస్తాయి. మనిషి అలికిడి వినిపిస్తే చాలు గుంతులేస్తూ పరుగులెత్తే పొడుగు చెవుల బెదురు జీవి చెవులపిల్లి. అయితే జపాన్ లోని ఆ దీవిలో మాత్రం కుందేళ్లు ఇందుకు భిన్నంగా ఉంటాయి. విప్లవ కవి వంగపండు ప్రసాదరావు రాసినట్లు సెమరపిల్లులు శంఖమూదినట్లు.. మనిషి అలికిడి వినిపిస్తే చాలు చుట్టుముట్టేస్తాయి. మనిషినే భయంతో పరుగులెత్తేలా చేస్తాయి. ఇంత పిసరు భయం లేదు. పైపెచ్చు సంఘటిత శక్తికి తిరుగే లేదన్నట్లు వేల సంఖ్యలో మందలు మందలుగా వచ్చి ఎదుట నిలుస్తాయి. అన్నికుందేళ్లు దాడి చేసినట్లుగా మీదమీదకి రావడం చూస్తే కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరే భయంతో వణకాల్సిందే. కుందేళ్లేమిటి.. మనుషులను బెదరించడమేంటి అనుకుంటున్నారా? ఆగండాగండి.. అక్కడికే వస్తున్నా.. జపాన్ లోకి కుందేళ్ల దీవిలో కుందేళ్లకు భయమంటే ఏంటో తెలీదు. జపాన్ లోని ఒకోనిషిమా దీవినే కుందేళ్లు అంటారు.

గతంలో ఈ దీవిని విషవాయువుల మీద పరిశోధనలకు వినియోగించేవారు. ఆ తరువాత దానిని పట్టించుకున్న వాళ్లే లేరు. అదిగో అలాంటి దీవిలో ఎవరో కొన్ని కుందేళ్లను వదిలారు. అనతి కాలంలోనే వాటి సంతతి వందలు దాడి వేలకు వేలు పెరిగింది.  వాటిని చూడడానికి జనం రావడం మొదలైంది. పెద్దగా సమయం తీసుకోకుండానే ఆ కుందేళ్ల దీవి ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.  జపాన్ సర్కార్ కూడా దీనిని కుందేళ్ల అభయారణ్యంగా భావించి, ఆ దీవిలో చెత్త వేయడాన్ని నిలిపివేసింది. విషవాయువుల ప్రయోగాలను అంతకు ముందే ఆపేసింది. అంతే కాదు.. ఆ దీవిలోకి పెంపుడు జంతువులను తీసుకువెళ్లడాన్నీ నిషేధించింది. కుందేళ్లకు ఆహారం అందించడానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చింది.

దీంతో అక్కడ పెరిగిన, పెరుగుతున్న కుందేళ్లకు తమ సహజసిద్ధ గుణమైన భయం మాయమైంది. స్వేచ్ఛగా ఆ దీవే తమ సామ్రాజ్యం అన్న ధీమా వచ్చేసింది. ఆ దీవికి వచ్చే పర్యాటకులు కేందేళ్లకు ఆహారం తీసుకురావడం సహజం కదా? ఆ ఆహారం కోసమే మనిషి అలికిడి వినిపిస్తే చాలు వేల సంఖ్యలో కుందేళ్లు ఆ మనిషిని చుట్టుముట్టేస్తాయి.  ఆ కుందేళ్ల దీవిని సందర్శించిన వారు అక్కడి కుందేళ్ల ధైర్య సాహసాలకు సంబంధించిన ఫొటోలూ, వీడియోలూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా దీవి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ జపాన్ లోనే అతి ప్రధానమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu