కేబినెట్ సహచరుడిపై పంజాబ్ సీఎం వేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇంతకీ పంజాబ్ ముఖ్యమంత్రి ఏం చేశారంటే.. తన కేబినెట్ మంత్రిపై వేటు వేశారు. అంతే కాకుండా ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు? ఆయన ఏం చేశారు అన్న ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తాయి.

ఆ మంత్రి పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా.. ఆయన చేసిందేమిటంటే కాంట్రాక్ట్ పనుల్లో ఒక శాతం కమిషన్ డిమాండ్ చేశారట. విజయ్ సింగ్లా కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆధారాలు  లభించడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆయనను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేశారు. అంతేనా  కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించి అరెస్టు చేయించారు. ఆప్ పార్టీ అవినీతిని అంతమొందించడానికి ఆవిర్భవించిందనీ, అవినీతి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా చీపురుతో ఊడ్చేస్తామని ఆయన తన చేతల ద్వారా నిరూపించారు.  పంజాబ్ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ చర్యే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఒక్క శాతం కమిషన్ (సరిగ్గా చేప్పాలంటే లంచం) అలా చేయడం అంటూ జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క మంత్రికైనా పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందా అన్నదే ఈ రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రి మాదిరిగా ఇక్కడ సీఎంలు చర్యలు తీసుకోవాలంటే వారి కేబినెట్లలో కనీసం ఒక్కరైనా మిగులుతారా అన్న చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. సామాజిక మాధ్యమంలో ఈ రకమైన చర్చ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి కనీసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఆ పదవులలో కొనసాగే అవకాశం ఉందా అన్న  సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు.

అవినీతిని నిర్మూలిస్తాం అన్న మాటలు, ప్రకటనలకే పరిమితం కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రిలా చర్యలు తీసుకుంటేనే అవినీతిని నిరోధించడం సాధ్యమౌతుందని సోషల్ మీడియాను నెటిజన్లు పోస్టులతో నింపేస్తున్నారు.