పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామా.. సిద్ధూతో మ్యాచ్‌లో కెప్టెన్ ఔట్‌..

పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామ చేశారు. హైక‌మాండ్ ఆదేశాల‌తో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పించారు. త‌న‌కు తెలీకుండా సీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేస్తూ.. ఇప్ప‌టికి మూడుసార్లు త‌న‌ను అధిష్టానం ఇలానే అవ‌మానించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమ‌రీంద‌ర్‌. ఎవ‌రిని ముఖ్య‌మంత్రి చేయాలో అధిష్టానం ఇష్ట‌మ‌ని.. త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం ప‌ద‌వికి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రం. 

కొంత‌కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అమ‌రీంద‌ర్‌కు, పీసీసీ చీఫ్‌ సిద్ధూకు మ‌ధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని క‌లిసిన ఉప‌యోగం లేకుండా పోయింది. గత అర్థరాత్రి, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ చేసిన ట్వీట్‌తో తాజా పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రావత్ త‌న ట్వీట్‌లో శాసనసభాపక్ష అత్యవసర  సమావేశం నిర్వహించనున్నట్లు. తెలిపారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలను కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. దీంతో అర్థరాత్రి నుంచే ఉహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్వాసకే, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాల్లో సిద్ధూ వర్గం విక్టరీ సింబల్స్’తో చెలరేగిపోయింది. అయితే, ఈ పరిణామాలు అన్నీ పైకి హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, చాలా కాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు  బహిర్గతంగా భగ్గు మంటూనే ఉన్నాయి. 

ముఖ్యమంత్రికి ఉద్వాసన అంటూ గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారం తనకు అవమానకరంగా ఉందని ఆయన నేరుగా సోనియాకే చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ తరుణంలో పార్టీ సీఎల్పీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక తాను సీఎం పదవిలో కొనసాగలేనని అమ‌రీంద‌ర్‌సింగ్‌ రాజీనామా  చేసిన‌ట్టు తెలుస్తోంది. 
 

Related Segment News