దావొస్ లో పంచ్ ప్రభాకర్.. జగన్ అండ ఉందనడాకి ఇదే సాక్ష్యం!

పంచ్ ప్రభాకర్.. ఏపీ హైకోర్టు పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాలని సీబీఐకి పలుమార్లు ఆదేశాలిచ్చింది. కానీ అతగాడు పరారీలో ఉన్నాడంటూ అన్ని మార్లూ సీబీఐ కోర్టుకు నివేదించింది. ఏపీ హైకోర్టు తీర్పులు, ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో నిందితుడు అయిన పంచ్ ప్రభాకర్ దావోస్ లో దర్జాగా తిరుగుతున్నాడు. ప్రపంచ వాణిజ్య సమావేశానికి వచ్చాడు. సీబీఐ అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ కు ఎలా రాగలిగాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా పరిశీలకులు చెబుతున్నారు. పంచ్ ప్రభాకర్ వైసీపీ అండతోనే అరెస్టును తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నాడని ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణలకు జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సమయంలోనే పంచ్ ప్రభాకర్ కూడా దావోస్ లో ప్రత్యక్షం కావడం బలం చేకూరుస్తోంది.

దావోస్ లో వైసీపీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. వైసీపీ నేతల పిలుపు మేరకే పంచ్ ప్రభాకర్ దావోస్ వెళ్లాడని విశ్వసనీయ వర్గాల కథనం. పరారీలో ఉన్నాడని ఒకసారి, సాంకేతిక అంశాలని ఒకసారి సీబీఐ హైకోర్టు ఆదేశించినా పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నది. దీంతో పంచ్ ప్రభాకర్ పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.  ఒక వైపు సీబీఐ పంచ్ ప్రభాకర్ కోసం గాలిస్తున్నామంటూ చెబుతూ వస్తుంటే, అతడు మాత్రం వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని బహిరంగంగా తిరుగుతున్నాడు.

ముఖ్యమంత్రి జగన్ హాజరైన దావోస్ సదస్సుకు పంచ్ ప్రభాకర్ ఎలా హాజరయ్యాడన్నదానిపై మాత్రం వైసీపీ నేతలు, సీబీఐ సహా ఎవరూ నోరు విప్పడం లేదు.  పంచ్ ప్రభాకర్ వైసీపీ నేతలతో ఉన్న ఫొటోలు, దావోస్ లో దర్జాగా తిరుగుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. దావోస్ లో ప్రభాకర్ వైసీపీ లోక్ సభాపక్ష నేత మిధున్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వర్గాల సమాచారం మేరకు పంచ్ ప్రభాకర్ దావోస్ లో జగన్ తో కూడా భేటీ అయ్యాడని తెలుస్తోందన్నారు.

కోర్టు అరెస్టుకు ఆదేశించినా సీబీఐ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. కోర్టు పంచ్ ప్రభాకర్ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఆయనతో భేటీ అయిన నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయనీ సందర్భంగా డిమాండ్ చేశారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుడితో వైసీపీ నేతల బేటీ ప్రజలకు ఎలాంటి సందేశాలివ్వడానికన్నది చెప్పాలన్నారు.  సీబీఐ కేసులలో ఏ వన్ నిందితుడిగా ఉండి, కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళిన వ్యక్తి, సిబిఐ గాలిస్తున్న మరొక వ్యక్తి తో భేటీ కావడాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయని భావిస్తున్నానన్నారు.