రాష్ట్రంలో పులివెందుల సంస్కృతి.. చంద్రబాబు మాటలు నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది. రాష్ట్రంలో జగన్ పాలన కారణంగా అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకు విపక్ష నేత పర్యటనలకు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా పోటేత్తుతున్న జనమే నిదర్శనం. అయితే విపక్ష నేతల భద్రతకు ముప్పు కలిగించేలా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది. ఇందుకు నెలల కిందటి నుంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ హఠాత్తుగా భద్రత పెంచడానికి కారణమేమిటో ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసిపోయింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన భద్రతకు ముప్పు పెరిగిందని ఎన్ఎస్టీ భావించివంది. జడ్ ప్లస్ క్యాటగరి సెక్యూరిటీ కవర్ లో ఉండే చంద్రబాబుపై ఆయన స్వంత నియోజకవర్గంలోనే దాడి యత్నం జరగడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయని  ఎన్ఎస్జీ గత ఆగస్టులోనే గుర్తంచింది. అందుకే   గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగుర్ని నియమించింది.  అంతే కాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు పర్యవేక్షణ డీజీపీ రేంజ్ అధికారికి అప్పగించింది. ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ స్వయంగా టీడీపీ కార్యాలయం,  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి మరీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక కుప్పంలో చంద్రబాబుకు  మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు 24 నుంచి చంద్రబాబుకు 12 ప్లస్ 12 ఎన్ఎస్జీ బృందం రక్షణ కవచంగా నిలుస్తోంది.

ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తనను, తన కుమారుడు లోకేష్ ను ఎలిమినేట్ చేద్దామనుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి చెప్పడమే కాకుండా రాష్ట్రంలో జగన్ సర్కార్ ను వ్యతిరేకించేవారు, విమర్శించే వారిని భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అలాగే వైసీపీ నేతలు తననే బెదరిస్తున్నారనీ, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పి ఉంటే.. పరిటాల రవీంద్రను హత్య చేసినట్లే తననూ లేపేసి ఉండేవారమని వైసీపీ నేతలు బెదరిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

ఇఫ్పుడు లోకేష్ ను చంపేస్తామంటున్నారని అన్నారు. ఔను గత ఆగస్టులో చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత పెంచినప్పుడు ఎవరికీ ఆయనకు ఈ స్థాయి ముప్పు ఉందని అర్ధం కాలేదు కానీ వైసీపీ నేత అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి   వైఎస్ రాజశేఖర్రెడ్డి... మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును అప్పుడే ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని చేసిన వ్యాఖ్యలు... ఇటీవలి కాలంలో వరుసగా చంద్రబాబు పర్యటనలలో ఆయన లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు గమనిస్తే.. ఎన్ఎస్జీ చంద్రబాబుకు భద్రత ఎందుకు పెంచిందో అవగతమౌతుంది.

ఇక ‘ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా తనను, తన కుమారుడిని టార్గెట్ చేశారని, బెదరిస్తున్నారనీ చెప్పారు. సొంత బాబాయిని చంపినంత తేలిగ్గా తననూ హత్య చేయాలని భావిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు, సాక్షులకు, దర్యాప్తు అధికారులకు బెదరింపుల సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు రాష్ట్రం తరలి ఎందుకు వెళ్లిపోయిందో, కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారో జగన్ చెప్పాలన్నారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు రాష్ట్రం బయట జరగాలని సుప్రీం కోర్టే ఆదేశించిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్రం మొత్తం పులివెందుల సంస్కృతి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారంటూ చంద్రబాబు ఇంత కాలంగా చేస్తున్న విమర్శలు కేవలం విమర్శలు కావని ఈ మూడేళ్లలో రుజువు అవుతూనే వస్తోంది.

 వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చారని.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి చంద్రబాబును, లోకేష్‌ను చంపుతామనే బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. నేర చరిత్ర ఉన్న నేతలు ఇలా ప్రకటనలు చేస్తూండటంతో టీడీపీ నేతల్లోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉండటంతోనే … కేంద్రం భద్రత పెంచిందని భావిస్తున్నారు. ఆషామాషీగా ఇలాంటి హెచ్చరికలు చేయరని.. రాజకీయ వర్గాలు సైతం భావిస్తున్నాయి.