ఊడిపోయిన పులిచింతల గేటు.. కృష్ణా జిల్లాలో ముంపు భయం 

నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టు దగ్గర అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టు ఒక గేటు ఊడిపోయింది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసే క్రమంలో  ఊడిపోయింది 16 నంబర్ గేటు. దీంతో ఆ గేటు ద్వారా భారీగా నీరు దిగువకు వెళుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులు ఉండగా..  అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో  గేటు ఊడిపోయింది. దీని ఫలితంగా మరో 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా దిగువకు వెళుతోందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

సమాచారం తెలిసిన వెంటనే ప్రాజెక్టు దగ్గరకు చెరుకున్న ఇరిగేషన్ అధికారులు ఎమర్జెన్సీ గేటును బిగిస్తున్నారు. మధ్యాహ్నానికి గేటు బిగించడం పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద‌ ఉధృతి పెరుగుతోంది. కృష్ణా , గుంటూరు జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ నది దాటే ప్రయత్నం చేయవద్దని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.

పులిచింతల ప్రాజెక్టులో  ప్రస్తుతం గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో  నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి ప‌రిస్థితిని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జ‌రిపారు.  స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌ని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ చెప్పారు. పులిచింత‌ల డ్యామ్ గేటు ఊడిపోవ‌డంతో కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.