మీడియా మీద శ్వేతాబసు కస్సుబుస్సు
posted on Dec 8, 2014 5:08PM

వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా క్లీన్ చిట్ పొందిన కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మీడియా మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మీడియాకి ఒక బహిరంగ లేఖ రాసింది. పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో తనతోపాటు ఒక వ్యాపారవేత్త వున్నాడని మీడియా రాసింది. ఈ విక్షయాన్ని మీడియా నిరూపించగలదా అని ఆమె సవాల్ విసిరింది. హైదరాబాద్ పోలీసులు చెబుతున్నట్టు నాతో వున్న ఆ బిజినెస్‌మేన్ ఎవరో నాకూ తెలుసుకోవాలని వుంది. మీరు చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. తాను రెస్క్యూ హోమ్‌లో ఉన్న సమయంలో తాను చెప్పినట్టుగా మీడియా అనేక కథనాలను ప్రచురించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను వ్యభిచారం చేస్తున్నానని తన పేరిట ఒక ప్రకటన కూడా విడుదల చేశారని శ్వేత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. శ్వేతా బసు ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో రెస్క్యూహోమ్‌లో తాను ఎలా గడిపిందీ, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందీ కూలంకషంగా వివరించింది. ఆమె మీడియా మీద అనేక ప్రశ్నలు సంధించింది.