ఏం గుండెరా అది...పది కాలాల పాటు బతకాలి
posted on Oct 19, 2025 10:56AM

మహేష్ బాబు తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పుట్టుకతో వచ్చే గుండె సమస్యలున్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలకు నిధులు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అవసరమైన పిల్లలకు సహాయం చేయడంపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం ఈ శస్త్ర చికిత్సలు ఐదు వేలకు చేరుకున్నాయంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇది నిజంగానే ఒక గుండెలు గెలిచిన వీరుడి విజయ గాథ.
అలాంటి వార్త ఎంత పెద్ద వార్త కావాలి? కానీ ఎక్కడా ఆ ఊసే ఉండదు. ఎవరూ కూడా దాని గురించి మాట్లాడరు. ఆయన కూడా దాని గురించి ఎక్కడా చెప్పరు. అదే కొందరు నటులు ఏ చిన్న సాయం చేసినా సరే.. అది ఇటు సోషల్ మీడియా అటు మెయిన్ మీడియాలో ప్రధాన వార్తగా నిలవాల్సిందే. కానీ మహేష్ బాబుకు ఇలాంటి పీఆర్ అంటే ఏమంత ఇష్టం ఉండదు.
ఆపదలో ఉన్నారు. ఆదుకుంటున్నాం దట్సాల్. ఇదీ మహేష్ లైఫ్ స్టైల్. దానికి తోడు వారు చిన్న పిల్లలు ఇలాంటి భావి భారతం రేపు ఆరోగ్యకరంగా రూపు దిద్దుకుంటేనే కదా.. ఆపై దేశ భవిష్యత్ బలంగా ఉండేది? అన్న ఆలోచన ఆయనది.నిజానికి ఇలాంటి వారికి పద్మశ్రీలు ఇవ్వాలి. పద్మభూషన్లతో సత్కరించాలి. వీరంతా గుప్తంగా తాము చేయాల్సిన పనులు చేసేస్తుంటారు. కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ ఎలాగో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహేష్ కూడా అంతే.. అయితే యాక్టింగ్ లేదంటే ఇదిగో ఇలాంటి ప్రజా సేవ.
అలాగని ఇదేదీ ఆయన రాజకీయ సోపానం కోసం చేసే యత్నం కానే కాదు. ఆ మాలకొస్తే ఆయన కుటుంబానికి రాజకీయాలు కొత్త కానే కాదు. ఆ దిశగా తన అభిమానుల చేత అరిపించుకోవడం వంటివి అస్సలు చేయరు. ఆయన కూడా పొలిటిక్స్ పట్ల ఎక్కువగా మక్కువ చూపించినట్టు కనిపించరు.. ఈ సమాజం ఎంతో ఇచ్చింది. మనమూ తిరిగి కొంత ఇచ్చేయాలి. లేకుంటే లావై పోతామన్న కోణం మహేష్ బాబుది. అందుకే ఇలా రివర్స్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారీ సొసైటీకి.
శ్రీమంతుడు మహేష్ బాబు కేవలం ఈ గుండె ఆపరేషన్లే కాదు.. కొన్ని గ్రామాల దత్తత కార్యక్రమం కూడా చేపట్టి ఆ దిశగా కొంత సమాజ సేవ చేస్తున్నారు. ఈ గ్రామాలు ఏవని చూస్తే అది ఏపీలోని తన తండ్రి జన్మస్థలం బుర్రిపాలెం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం.. దత్తత తీస్కుని అక్కడ తన వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మహేష్ బాబు.
అభిమానుల చేత ప్రిన్స్ అని సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం కాదు.. నిజంగానే వారి కోసం తన వంతుగా అది కూడా ఎక్కడా ఏ హంగూ ఆర్బాటం లేకుండా.. మహేష్ చేస్తున్న ఈ సేవకు మనమంతా కలసి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ఏమంటారు? ఐదు వేలకు పైగా గుండెలకు ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు నిజంగానే ఒక రియల్ హీరో.. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అన్నది ఆయన అభిమానులంటోన్న మాట.