రాష్ట్ర‌ప‌తి నోట అమ‌రావ‌తి మాట‌.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు పోరాటం..

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న బృందంతో క‌లిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామన్నారు చంద్ర‌బాబు.

‘‘రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మీడియానూ నియంత్రిస్తున్నారు. టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టారు. అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కస్టడీలో టార్చర్ పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే మా కార్యాలయంపై దాడి చేశారు’’ అని రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లామ‌ని చంద్రబాబు తెలిపారు.  

ఏపీలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లే దాడి చేసి ప్రజలపై కేసులు పెడుతున్నారని.. రాష్ట్రాన్ని భయానకంగా మార్చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రపతికి అవన్నీ వివరించామన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 

సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థని డీజీపీ భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీని రీకాల్‌ చేయాలని.. ఆయన చేసిన తప్పులకు శిక్షించాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని.. దోషులను కఠినంగా శిక్షించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

టీడీపీ ఫిర్యాదుపై రామ్‌నాథ్ కోవింద్‌ సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో పరిస్థితిపై వాకబు చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినవన్నీ చాలా సీరియస్ అంశాలని అన్నారు. వీటన్నింటినీ పరిశీలనకు తీసుకుంటామని రాష్ట్ర‌ప‌తి టీడీపీ బృందానికి తెలిపార‌ని తెలుస్తోంది. ఈ భేటీలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మూ జ‌రిగింది. అమరావతి రాజధాని ఏమైందని టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి  ప్రశ్నించారు. అమరావతిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రపతికి రాజమండ్రి శిరోముండనం కేసు విషయం వివరించారు. ‘మీరు ఆదేశించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని’ రాష్ట్రపతికి టీడీపీ బృందం తెలిపింది. ఇలా.. అమ‌రావ‌తి విష‌యంపై స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తే ఎంక్వైరీ చేయ‌డం చూస్తుంటే.. ఢిల్లీ వ‌ర్గాలు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రిపై వ్య‌తిరేకంగానే ఉన్న‌ట్టు భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.