అదానీ సంక్షోభం వెనక అజీమ్ ప్రేమ్ జీ ?

నిజం గడప దాటే సరికి, అబద్ధం పపంచాన్ని చుట్టి వస్తుందని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, కార్పొరేట్ దిగ్గజం అదానీ మహా పతనం వెనక మరో కార్పొరేట్ దిగ్గజం విప్రో అధినేత  అజీమ్ ప్రేమ్ జీ హస్తం ఉందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. నిజానికి  అదానీ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి అసలేం జరిగింది  అనే విషయంలో ఆరోపణలు, ప్రత్యరోపణలతో పాటుగా అనేక ఊహగానాలు, వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి.

పట్టుమని పది మంది ఉద్యోగులు లేని  అమెరికా స్థావరంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్  స్టాక్ బ్రోకర్ సంస్థ  హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌  నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతలోనే రాజకీయ జొరబడి పార్లమెంట్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి అటూ ఇటూ నిలవడంతో కార్పొరేట్  రాజకీయ అక్రమ సంబంధాలపై పాత, కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.  హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌  నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతలో ఒక్క సారిగా కుప్పకూలిన అదానీ మార్కెట్ విలువ మెల్లిమెల్లిగా పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. మరోవంక  2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి  ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నట్లు అనుమానిస్తున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారనే అనుమనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు ఉంటూనే లోగుట్టును వెలికి తీసేందుకు గట్టిగా నడుం బిగించినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలు విప్రో కంపెనీ యజమాని  పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో వచ్చిన కథనం ఆ అనుమానాలను మరింతగా బలపరిచే విధంగా ఉందని అంటున్నారు. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుని సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్ఛంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉందని, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ  ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆర్గనైజర్‌ కథనంలో పేర్కొంది. 

ఆర్గనైజర్‌ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్షణ ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ,  Adaniwatch.org అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు  అని ఆర్గనైజర్‌ పేర్కొంది. అలాగే  ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే  అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని ఆర్గనైజర్‌ ఆరోపించింది.

అయితే ఎంతకాదన్నా నిప్పు లేనిదే పోగారాడు. అలాగే ఎవరు ఎన్ని  ఆరోపణలు చేసినా ఎవరు ఎంతగా ఎదురు దాడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఈ లోగా పుణ్య కాలం పూర్తయి పోతుంది. ఏమి జరిగిన ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అంతా గప్ చిప్.. అందుకే, నిజం ఎంతో నిగ్గు తేల్చేందుకు ప్రతిపక్షాలు కోరుతున్నా జేపీసీ కాకున్నా  సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరగవ వలసిన అవసరం అయితే ఉందని అంటున్నారు.