సమ్మెపై ఉండవల్లి ఉవాచ.. ఇంతకీ  ఏం చెప్పాడబ్బా!

పీఆర్సీ పేరుతో తమను నిండా ముంచిన జగన్ రెడ్డి సర్కార్ తీరుపై ఏపీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యవక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పీఆర్సీపై చర్చలకు రావాలన్న సర్కార్ ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మె నిర్ణయం చేయొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఒక పక్కన కరోనా బీభత్సం కొనసాగుతోందని, మరో పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలకు ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సమ్మెను ఆపాలని ప్రార్థిస్తున్నానంటూ ఉండవల్లి తన లేఖలో పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై 10వేల 247 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోందని ఉండవల్లి ప్రస్తావించారు. జీతాలు పెంచాలని ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగడం సహజం అన్నారు. అయితే.. చిన్న మొత్తంలోనే అయినా.. పెంచిన జీతాలు వద్దంటూ సమ్మెకు దిగడం ఇదేతొలిసారి కావచ్చని ఉండవల్లి తన లేఖలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఏపీలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల్లో సమ్మెను ఆపాలని కోరారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కూడా పంతాలు, పట్టింపులకు పోకుండా పరస్పరం చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నానన్నారు.