సలహాదారు పదవికి పీకే రాజీనామా.. కాంగ్రెస్ గూటికి ఖాయమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త చాలా కాలంగా రాజకీయ, మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. జూలై 13 వ తేదీన ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, అయన సోదరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇక అక్కడి నుంచి పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో ఇతరత్రా వినవస్తూనే ఉంది. అయితే, ఇంతవరకు అటు కాంగ్రెస్ వర్గాలు గానీ, ఇటు పీకే గానీ,’అసలేం జరిగింది?’ అనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్టీ కమల్ నాథ్, ఏకే అంటోనీ, వేణుగోపాల్, వంటి సీనియర్  నాయకులతో ఇదే విషయంగా సుదీర్ఘంగా చర్చించారని, పార్టీలో పీకేకు ఇచ్చే పోస్టు, ప్రాధాన్యతల విషయంలోనూ రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారని కథనాలు వినవచ్చాయి. అప్పట్లోనే, పీకే కాంగ్రెస్’లో చేరడం ఖాయమని ఊ(వ్యూ)హాగానాలు షికార్లు చేశాయి. అయినా, షరా మాములుగా అధికారిక సమాచారం మాత్రం లేదు. అంతే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ జరగ లేదు, ఎవరూ ఏమీ కాలేదు.  

ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిశోర్ మరో పుకారుకు ప్రాణం పోశారు. పంజాబ్  ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏమో కానీ, ఆయన పంజాబ్ పదవికి రాజీనామా చేసింది అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే అని ప్రచారం అయితే మొదలైంది. నిజానికి ప్రశాంత్ కిశోర్  తన రాజీనామాకు, పెద్దగా ఊహకు అందని కారణాలు ఏమీ లేవని చెప్పకనే చెప్పారు.ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ‘ కు రాసిన లేఖలోనే పేర్కొన్నారు.అలాగే, తమ   భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. 

అయినా ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు మరిన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకే పీకే పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి. అయితే దీనిపై అటు పీకే గానీ.. ఇటు కాంగ్రెస్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ ఏడాది మార్చిలో పీకే.. అమరీంద్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఈ పదవిలోకి తీసుకున్నారు.2022 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్‌ను అమరీందర్‌ తన సలహాదారుగా నియమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.2017 ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు అమరీందర్‌- పీకే కలిసి పనిచేశారు. అంతేగాక, ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న కెప్టెన్‌- సిద్ధూ సమస్య పరిష్కారంలో పీకే క్రియాశీలకంగా పనిచేశారు.

పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాల్లో తాను ఇప్పటికే విఫలమయ్యాయనన్న కిశోర్‌.. భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో మాత్రం చెప్పలేదు. కొన్నేళ్ల క్రితం పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీతో భేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన తమ వ్యాపార ఎత్తుగడల్లో భాగంగానో లేక వేరే కారణాల చేతనో గానీ, జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విపక్షాలు అన్నింటినీ ఏక చేసి, మోడకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ఇటు మమత, అటు పవర్ చేస్తున్న ప్రయత్నాలకు పీకేనే సూత్రధారిగా అనిచేస్తున్నారు. ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన వేసే ప్రతి అడుగు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అందుకే, పంజాబ్ ముఖ్యమంత్రి సలహదారు పదవికి రాజీనామా చేయడం కూడా  ఊహగానాలకు ఊపిరి పోసింది. వాస్తవం ఏమిటన్నది ... ఇప్పుడే తెలిసే అవకాశం అయితే లేదు. 

అందరికీ  శకునం చెప్పీ ఎలుక కుడితిలో పడింది అన్నట్లుగా, వ్యూహకర్తగా ఎదరినో అందలం ఎక్కించిన ప్రశాంత్ కిశోర్ ... తొందర పడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని మాత్రం అనుకోలేము. అందులోనూ ఆయన ఒక సారి, జేడీయూలో వేలు పెట్టి చేయ కాల్చుకున్నారు. జేడీయూలో చేరి సంవత్సరం తిరగ కుండానే రాజకీయలానుంచి తప్పు కున్నారు. రాజకీయ వ్యూహకర్తగా అద్భుత విజయాలు సాధించిన పీకే, రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యారు .. ఆ నిజం ఆయనే చెప్పారు. సో .. పీకే నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది .. ఒక్క పీకే నే చెప్పగలరు.