నవంబర్ లోగా బెంగళూరులో గుంతలు లేని రోడ్లు!
posted on Sep 23, 2025 3:25PM
.webp)
కర్నాటక రాజధాని బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. నవంబర్ నాటికల్లా బెంగళూరు నగరంలో రోడ్లపై గుంతలనేవే ఉండవని చెప్పారు. ఆ విధంగా కాంట్రాక్టర్లకు స్పష్టమైన గవుడు విధించినట్లు చెప్పారు. అయినా దేశ రాజథాని నగరం ఢిల్లీలో ఏకంగా ప్రధాని నివాసం ముందు రోడ్డుపైనా గుంతలు ఉన్నాయన్నారు. అంతెందుకు.. రోడ్లపై గుంతలు ఉండటం అన్నది దేశ వ్యాప్త సమస్య అన్న డీకే శివకుమార్.. వాటిని వేటినీ పట్టించుకోకుండా మీడియా కేవలం బెంగళూరునే లక్ష్యం చేసుకుందని విమర్శించారు. గతంలో కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే రోడ్లు ఎందుకిలా ఉంటాయని ప్రశ్నించారు.
బెంగళూరు రోడ్లు గుంతలమయంగామారిపోయాయంటూ కేంద్ర మంత్రి హెచ్ డీ కుమార స్వామి విమర్శించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఒక టెక్ కంపెనీ సీఈవో కూడా బెంగళూరు రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమ వేదికగాచేసిన పోస్టు వైరల్ అవ్వడమే కాకుండా, బెంగళూరు నుంచి సదరు కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లుగా ఆ సీఈవో ఆ పోస్టులో పేర్కొన్నారు. దానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ కంపెనీని విశాఖకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.