ఆస్పత్రిలో చేరిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్
posted on Jan 8, 2025 1:58PM

ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహారు రూపొందించే పనికి స్వస్తి చెప్పి తానే సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన సొంత పార్టీ కోసం ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే పనిలో ఉన్నారు. బీహార్ లో అధికారమే లక్ష్యంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. అయినా ఆయన సొంత పార్టీ జన్ సూరస్ కు పెద్దగా మైలేజీ వచ్చినట్లు కనిపించదు. ఈ నేపథ్యంలోనే ఆయన విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా నిలబడ్డారు.
ఇంతకీ బీహార్ విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా విద్యార్థులు గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వారి ఆందోళనకు మద్దతుగా ఆ నెల 2 నుంచి నిరవధిక నిరశనకు దిగారు. అయితే పాట్నా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి పాట్నా ఆస్పత్రికి తరలించారు. అనంతరం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అయితే దీనిని నిరాకరించడంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. తరువాత ప్రభుత్వం ఆయనకు బేషరతు బెయిలు మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నాలుగు రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష కారణంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మరోసారి పాట్నా ఆస్పత్రిలో చేరారు.