పంద్రాగస్టు పండుగ వేదికగా.. రాజకీయ ప్రచార సభలు

స్వాతంత్రం వచ్చిందని సభలు చేసి సంబరపడిపోతే సరిపోదన్నాడు మహాకవి శ్రీశ్రీ.. అయితే నేటి రాజకీయ నాయకులు మహాకవి శ్రీశ్రీ మాటను వేరేగా అర్ధం చేసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సంబరాలతో సరిపెట్టేయకుండా రాజకీయ విమర్శలకు వేదికగా చేసేసి తాము ఆజాదీ కా అమృతోత్సవ్ ను కేవలం సంబరాలతో సరిపెట్టేయలేదనీ, వాటిని విమర్శల మసాలా జోడించామని చెబుతున్నారు.

లేకుంటే జాతి మొత్తం విభేదాలను, అంతరాలను, తారతమ్యాలనూ మరచి చేసుకోవలసిన ఈ పండుగను, వేడుకలు రాజకీయ విమర్శలకు వేదికగా మార్చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను రాజకీయ వేదకగా మార్చి తమాషా చూశారు. ముందుగా మోడీ విషయానికి వస్తే.. ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని మోడీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశం సాధించిన విజయాలు, ఘనతల గురించిన ప్రస్తావన కన్నా.. అవినీతి, వారసత్వ పాలనపై విమర్శలకే పెద్ద పీట వేశారు. ప్రతిపక్షాలు ఏం చేసినా అది అవినీతి, వారి అధికారం అంతా వారసత్వ మయం అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది.

మొత్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రసంగం అంతా స్వోత్కర్ష, పరనిందగా సాగింది. దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న తన పాలనకు ప్రజాశీర్వాదం కావాలని స్వాతంత్ర్యద్యమం సందర్భంగా జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రధానిగా మోడ ఎర్రకోట బురుజులపై నుంచి జెండా ఎగురవేయడం ఇది తొమ్మిదో సారి. దేశంలో అవినీతి నిర్మూలనకు తాను మొదటి సారి జెండా ఆవిష్కరించినప్పటి నుంచి తొమ్మిదో సారి జెండా ఎగురవేస్తున్న నాటి వరకూ ఆయన చేసింది ఏమిటో చెప్పడానికి ఇంత కంటే మంచి సందర్భం మరొకటి ఉండదు.. కానీ మోడీ ఈ సందర్భాన్ని అందుకు కాకుండా విపక్షాలపై పరోక్షంగా నిందలు వేయడానికీ, విమర్శలు గుప్పించడానికి ఎన్నుకున్నారు.

అంటే స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభ వేళ ఆయన విపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.  ఎనిమిదేళ్లుగా దేశంలో తమ పార్టీ అధికారాన్ని విస్తరించడానికి ఇచ్చిన ప్రాధాన్యం మోడీ దేశంలో అవినీతి నిర్మూలనకు ఇవ్వలేదని పరిశీలకుల విమర్శలను ఆయన పట్టించుకోలేదు. ఆయన దృష్టిలో అవినీతి నిర్మూలన అంటే ప్రత్యర్థి పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులేనని విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాజకీయ వేధింపులనే మోడీ అవినీతి నిర్మూలనగా సూత్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నాయి.   

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయనదీ ఒకే అజెండా.. అది మోడీపై విమర్శలు. తెలంగాణకు మోడీని శత్రువుగా చూపడానికే ఆయన స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేదికను ఎంచుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం, ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, ప్రజాసమస్యలు, వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల కారణంగా సంభవించిన నష్టం ఇత్యాది అంశాలపై ఆయన దృష్టి సారించకుండా కేవలం రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడం, మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడానికే కేసీఆర్ ప్రసంగం పరిమితమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇక ఏపీ ముఖ్యమంత్రి అయితే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వోత్కర్షకు ఇచ్చినంత ప్రాధాన్యం మరే  ఇతర అంశానికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆజాదీ కా అమృతోత్సవ్ సంబరాలకు రాజకీయ రంగు పూసి సమావేశాలను ఎన్నికల ప్రచార సభలుగా మార్చేసిన వైనంపై ప్రజలలో నిరసన వ్యక్తమౌతున్నది.  స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటేలా కాకుండా రాజకీయ ప్రచారం కోసం అధికార పార్టీలు ఈ వేడుకలను వేదిక చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.