రాహుల్ పర్యటనకు అడ్డంకులు.. ఓయూ కేంద్రంగా పొలిటికల్ హీట్

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను ఎలాగైనా విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సాహం ప్రదర్శిస్తుంటే..ఎలాగైనా కట్టడి చేయాలని అధికార తెరాస నిర్బంధ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి నిరాకరించడం, నిరసనలకు అవకాశం ఇవ్వకుండా విద్యార్థి నాయకులను ముందుస్తు అరెస్టులు చేయడం ద్వారా వర్సిటీ సెంటర్ గా రాజకీయ వేడి రగలడానికి కేసీఆర్ సర్కార్ కారణమైంది.దీంతో  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేసింది. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎలాగైనా సరే రాహుల్ ఉస్మానియాకు వస్తారంటూ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ యూ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.  ఎన్ఎస్ యూ రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలకు పిలుపు నివ్వడంతో రాష్ట్ర మంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఓయూ మొత్తాన్ని పోలీసులు దిగ్బంధించారు. రాహుల్ పర్యటనకు అనుమతి లేదనీ, వర్సిటీలో రాజకీయ కార్యకలాపాలను అనుమతించేది లేదని వీసీ విస్సష్టంగా తేల్చేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో గాందీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 
మొత్తంగా రాహుల్ పర్యటన ముందు రాష్ట్రం రగిలిపోతున్నది. రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఏ మాత్రం తగ్గడం లేదు. మహిళా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధంతో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు.  ఉద్యమాల పురిటి గడ్డ వంటి ఉస్మానియా వర్సిటీ కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయం రగులుతోంది.
 యూనివర్సిటీలోకి రాహుల్‌ గాంధీని తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తెరాసల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉస్మానియాలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తుంటే, వర్సిటీలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదన్నది వర్సిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం దానితో తెరాసకు ఏం సంబంధమని అధికార పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతి
ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన విశ్వవిద్యాలయం నుంచే తెరాసపై దండయాత్ర చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నెల  6న వరంగల్‌ రైతు సంఘర్షణ సభకు రానున్న రాహుల్‌ గాంధీని 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం ఓయూ వీసీని కలిసి అనుమతి కోరడం, ఆయన తిరస్కరించడం జరిగింది. వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.  గతంలో  ఓయూలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. . 2016 జూన్‌ 4వ తేదీన తెలంగాణ జనజాతర సమావేశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూ  విద్యా సంబంధ సమావేశాలకు తప్ప, రాజకీయ సంబంధిత సమావేశాలకు వేదిక కారాదని హైకోర్టు జూన్‌ 5వ తేదీన తీర్పు చెప్పింది. ఓయు కార్యనిర్వహక కౌన్సిల్‌ సైతం అక్కడ ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. మైకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానం చేసింది. 2020లో చేసిన తీర్మానాలను చూపి ఓయూ అధికారులు రాహుల్‌ సభకు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. అయితే ఇప్పుడు అక్కడ అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది.   తెరాసకు వ్యతిరేకత ఉన్న చోట   కాంగ్రెస్‌ను అనుమతిస్తే   ఇబ్బందులు తప్పవని భావించిన కేసీఆర్‌.. అక్కడ రాహుల్‌ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు రాహుల్‌ పర్యటన గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఓయూ కేంద్రంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓయూలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమాలు పోటీలు పడి మరీ నిర్వహిస్తున్నారు.  పోటాపోటీగా ఆందోళనలతో యూనివర్సిటీని అట్టుడికిపోతోంది. ఒక మరోవైపు తెరాస, కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు శృతి మించుతున్నాయి. రాహుల్‌ గాంధీ ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని తెరాస డిమాండ్‌ చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌ గాంధీకి అనుమతి ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తోంది. అసలు రాహుల్‌ గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్‌ ఎందుకు భయపడి అడ్డుకుంటున్నారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ సహా 18 మంది అరెస్టు చేశారని.. ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఓయూ అధికారులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో   న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్‌ నగరంలో 7వ తేదీ రాహుల్‌ పర్యటనలో తగినట్లు కార్యక్రమాలను మార్పులు చేసి విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మరో చోటైనా నిర్వహించేందుకు పీసీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకుంటోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu