జగన్ సర్కార్ కు ఎన్టీఆర్ బాసట..

రాయ‌ల‌సీమ‌ను భారీ వ‌ర్షాలు కుదిపేశాయి. వ‌ర‌ద వెల్లువెత్తి ఊళ్ల‌కు ఊళ్ల‌ను నామ‌రూపాలు లేకుండా చేసింది. అన్న‌మ‌య్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. చెరువులకు గండ్లు ప‌డ్డాయి. ప్ర‌కృతి ప్ర‌కోపంతో పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేత‌గానిత‌నం వ‌ల్లే ఇంత‌టి న‌ష్టం వ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వ‌ర‌ద‌పై అధికారులు ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌లేద‌ని.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి క‌నీసం బాధితుల‌ను ఓదార్చ లేద‌ని అంతా మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వ‌మే కాదు.. ప్ర‌కృతి విప‌త్తుల్లో స్పందించే టాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం ఈసారి చేయూత అందించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం 25 ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించి.. అంద‌రికంటే ముందు వ‌రుస‌లో నిలిచారు. 

వ‌ర‌ద బాధితుల‌కు ఎన్టీఆర్ 25 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించ‌డం అభినంద‌నీయ‌మే. కానీ, ఈ స‌మ‌యం, సంద‌ర్భం వ‌ల్లే రాజ‌కీయ కోణంలో చూడాల్సి వ‌స్తోందని అంటున్నారు. ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు భార్య‌పై వైసీపీ నేత‌లు అసంబ‌ద్ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది. నంద‌మూరి కుటుంబం మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీ నాయ‌కుల‌ను గ‌ట్టిగా హెచ్చ‌రించింది. కానీ, జూనియ‌ర్ మాత్రం స‌ప‌రేట్‌గా ఓ వీడియో రిలీజ్ చేయ‌డం.. అందులో ఎక్క‌డా నంద‌మూరి పేరు ఎత్త‌కుండా.. వైసీపీని గ‌ట్టిగా నిల‌దీయ‌కుండా.. ఉత్తుత్తి మాట‌ల‌తో లైట‌ర్ వే లో మ‌మ అనిపించారంటూ ఇటు టీడీపీ, అటు సోష‌ల్ మీడియా దుమ్మెత్తిపోసింది. కొడాలి, వంశీలు ఎన్టీఆర్‌కు స‌న్నిహితులు కావ‌డ‌మే ఈ ర‌చ్చ‌కు కార‌ణం. ఆ త‌ర్వాత మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీలు సైతం స్పందిస్తూ.. జూనియ‌ర్‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేదంటూ కాస్త క‌వ‌రింగ్ కూడా ఇచ్చుకున్నారు. 

ఇలా ఎన్టీఆర్‌-వైసీపీ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతున్న స‌మ‌యంలోనే వ‌ర‌ద బాధితుల‌కు ఆస‌రాగా 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండ‌స్ట్రీలో ఇంకా పెద్ద వాళ్లు చాలామందే ఉన్నా.. జూనియ‌రే మొద‌ట‌గా ఇలా ముందుకు రావ‌డాన్ని అనుమానంగా చూస్తున్నారు. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీ నేత‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీకి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఇక జూనియ‌ర్ చాలాకాలంగా టీడీపీకి, నంద‌మూరి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. ఇటీవ‌లి వీడియోలో వైసీపీపై త‌మ‌ల‌పాకుల‌తో కొట్టిన‌ట్టు సుతిమెత్త‌గా మాట్లాడారు. తాజాగా, వ‌ర‌ద బాధితుల‌కు సాయంగా వైసీపీ ప్ర‌భుత్వానికి 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఇలా వ‌రుస ప‌రిణామాలన్నీ చూస్తుంటే.. జూనియ‌ర్ టీడీపీకి దూర‌మ‌వుతున్న‌ట్టు ఉంద‌ని అంటున్నారు.