పోలవరం పూర్తి కావడం అసాధ్యం.. కేంద్రం క్లారిటీ.. జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌తేనా?

2021, డిసెంబ‌ర్ చివ‌రిక‌ల్లా పోల‌వ‌రం పూర్తి చేస్తాన‌ని గ‌తంలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాట‌లు చెప్పారు. చేత‌ల్లో మాత్రం చేతులెత్తేశారు. 2021 కాదు క‌దా.. 2022 నాటికైనా పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని కేంద్రం అంటోంది. జ‌స్ట్ అన‌డ‌మే కాదు.. పార్ల‌మెంట్‌లో ఆ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. 

‘‘వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోంది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ప్రాజెక్టు స్పిల్‌వే ఛానల్‌ పనులు 88 శాతం, అప్రోచ్‌ ఛానల్‌ ఎర్త్‌వర్క్‌ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలట్‌ ఛానల్‌ పనులు 34 శాతమే పూర్తయ్యాయి. పోలవరం సవరించిన అంచానాలు రూ.55,548 కోట్లకు టీఏసీ ఆమోదం తెలపింది’’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది.   

నిర్ణీత గడువులోగా పోలవం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం తెలిపింది. 

పోల‌వ‌రం ప‌నులు గ‌తంలో ఎలా సాగేవి.. ఇప్పుడు ఎలా జ‌రుగుతున్నాయంటూ అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప‌రుగులు పెట్టింది. సోమ‌వారం..పోల‌వారంగా మార్చుకొని.. ప్రాజెక్టు ప‌నుల‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. గ‌త‌ టీడీపీ ప్ర‌భుత్వానికి అటు అమ‌రావ‌తి.. ఇటు పోల‌వ‌రం.. ఈ రెండే ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఉండేవి. కానీ, జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చాక సీన్ మారిపోయింది. అమ‌రావ‌తి, పోల‌వ‌రం రెండూ అట‌కెక్కాయి. రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటూ పోల‌వ‌రాన్ని రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కి న‌డిపించారు. జ‌గ‌న్ బ‌ల‌హీన‌త‌ల‌ను ఒడిసిప‌ట్టి.. కేంద్రం సైతం పోల‌వ‌రం నిధుల‌పై మొండికేస్తూ వ‌చ్చింది. జ‌గ‌న్ పిల‌క మోదీ చేతిలో ఉండ‌టంతో.. పోల‌వ‌రంపై గ‌ట్టిగా పోరాడ‌లేని దుస్థితి. రాష్ట్ర ఖ‌జానాలో డ‌బ్బులు లేక‌.. పున‌రావాసం, ప‌రిహారంలో తీవ్ర జాప్యం జ‌రుగుతోంది. అలా, జ‌గ‌న్‌రెడ్డి వైఫ‌ల్యం పోల‌వ‌రానికి శాపంగా మారింది. పోల‌వ‌రం.. ఎంతెంత దూరం అంటే.. మ‌రింత దూరం అన్న‌ట్టుగా వెన‌కెన‌క్కి వెళుతోంది. గ‌డుపులోగా ప్రాజెక్టు పూర్తికావ‌డం అసాధ్యమ‌ని కేంద్ర వివ‌ర‌ణ‌తో తేలిపోయింది.