11 నుంచి 26 శాతానికి పెరిగిన వ్యతిరేకత! అయినా మోడీనే ప్రపంచ టాప్ లీడర్.. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గిందా? కొంత కాలంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ వస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించాలని కాషాయ దళం భావిస్తుందా? ఇదే చర్చ కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రధాని మోడీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై బీజేపీలో టెన్షన్ పెరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..  ప్రపంచంలోనే పాపులారిటీలో టాప్ లీడర్. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఆయనకే మొదటి స్థానం దక్కింది. సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న లీడర్ గా మోడీనే నిలిచారు. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ను కూడా వెనక్కి నెట్టారు నరేంద్ర మోడీ. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత.. భారత ప్రధాని క్రేజీ తగ్గిందనే వార్తలు వచ్చాయి. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలమైందంటూ అంతర్జాతీయ మీడియాలో భారీగా కథనాలు వచ్చాయి. దేశంలో మోడీపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత కనిపిస్తోంది. 

నరేంద్ర మోడీ క్రేజీ తగ్గిందనే వార్తలతో కలవరపడుతున్న కమలనాధులకు ఊరటనిచ్చే న్యూస్ వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ  ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీనే మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. పలు దేశాల అధినేతలకన్నా ముందు నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ చేసిన సర్వేలో 66 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీనే మళ్లీ దేశాధినేతగా కావాలని కోరుకుంటున్నారట. ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఆ సర్వే ఫలితాలను మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ లిస్టులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 అగ్రదేశాధినేతల కన్నా ప్రధాని మోడీకే ఎక్కువ మంది జై కొట్టారు. 

భారత్ లో 2,126 మందిని సర్వే చేస్తే అందులో 66 శాతం మంది.. ప్రధాని మోడీకి ఓటేశారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే గతంతో పోలిస్తే మోడీ స్కోర్ పడిపోయింది. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన ఆగస్టు 2019లోమోడీని దేశంలో  82 శాతం మంది ఆమోదించారని, కాని ఇప్పుడది 65 శాతంగానే ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది. 2019లో మోడీని కేవలం 11 శాతం మందే వ్యతిరేకించగా.. ప్రస్తుతం అది 26 శాతానికి పెరిగింది. ఇదే బీజేపీలో కొంత ఆందోళన రేపుతోంది. 

65 శాతం మంది ఆమోదంతో మోడీ తర్వాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ ఉన్నారు. మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%) ఉన్నారు.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. ఆయనకు  53 శాతం మంది అమెరికన్లు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది.