తిరుపతి యువకుడికి ప్రధాని మోడీ ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంసించారు. మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ.. సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు ఏపీ వెదర్ మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం అందిస్తూ సాయి ప్ర‌ణీత్ మంచి పని చేస్తున్నార‌ని చెప్పారు. బెంగ‌ళూరులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తోన్న సాయి ప్ర‌ణీత్ రైతుల‌కు అందిస్తోన్న సేవ‌ల‌కు గాను ఐక్య‌రాజ్య‌స‌మితి, భార‌త వాతావ‌ర‌ణ శాఖ నుంచి కూడా గ‌తంలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న్ కీ బాత్‌లో మోడీ ప్ర‌స్తావించారు.

చండీగ‌ఢ్‌కు చెంద‌ని 29 ఏళ్ల సంజ‌య్ రాణాను కూడా మోదీ ప్ర‌శంసించారు. ఆ యువ‌కుడు ఫుడ్ స్టాల్ ను నిర్వ‌హిస్తుంటాడ‌ని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భ‌తూర్ అనే వంట‌కాన్ని అమ్ముతుంటాడ‌ని మోడీ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయ‌న ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు. త‌మిళ‌నాడులోని నీల‌గిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మ‌హిళ అంబ‌ర్క్స్ ప్రాజెక్ట్ చేప‌ట్టి సేవ‌లందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌శంసించారు. కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లేందుకు ప‌డుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని  వారి కోసం ఆమె ఉచితంగా ర‌వాణా స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. త‌న స‌హ‌చ‌ర ఉద్యోగుల వ‌ద్ద విరాళాలు సేక‌రించి ఆమె ఈ సేవ‌లు కొన‌సాగిస్తున్నార‌ని ప్రధాని వివ‌రించారు. ఆమె మొత్తం ఆరు అమ్‌బ‌ర్క్స్  స‌ర్వీసులు న‌డిస్తున్నార‌ని కొనియాడారు.

ప్రజలకు కొవిడ్ జాగ్రత్తలు చెప్పారు ప్రధాని మోడీ. పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునే స‌మ‌యంలో క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని  సూచించారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌ని, కొవిడ్ నియంత్ర‌ణ నియ‌మాల‌ను మ‌ర్చిపోకూడ‌ద‌ని మోడీ తెలిపారు. ఒలింపిక్ ప్లేయర్లు ఎన్నో కష్టాలు భరించి... ఆ స్థాయి కి వెళ్లారన్న ప్రధాని మోడీ.. వారిని సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని కోరారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోడీ.. మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు  శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు ప్రధాని మోడీ.