పీకే సర్వే ..ట తెరాస దే గెలుప..ట

ప్రశాంత్ కిశోర్ గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. అవును, ఒకప్పడు రాజకీయ పార్టీలు  అయన వెంట పడిన మాట నిజం. కానీ, ఇప్పడు ఆయనకు అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై, ఆయన తమ పొలిటికల్ యాంబిషన్స్ బయట పెట్టుకున్నారు. అంతవరకూ ఆయన వ్యూహకర్త గానే ఉంటారని భావించిన వివిధ పార్టీల నాయకులు, ఒక్క సారిగా ఆయన  ఏకంగా కాంగ్రెస్ నే  కబ్జా చేసేందుకు స్కెచ్ గీయడం చూసి అవక్కాయ్యారు.వీడు మామూలోడు కాదు, మహా డేంజర్’ అనే విషయాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు.

ఇక అక్కడి నుంచి మమతా బెనర్జీ సహా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  రాజకీయ పార్టీలు ఏవీ ఆయన్ని దగ్గరకు రానీయడం లేదు. ఎటొచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆయన పేరు ఎంతో కొంత వినిపిస్తోంది. నిజానికి, రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి నిలబెట్టే ఆలోచను తెరమీదకు తెచ్చింది పీకేనే. అయితే, చివరకు ఆయన పాత్ర ప్రమేయం లేకుండానే పతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉమ్మడి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్  రాజకీయ నాయకుడు యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. అంటే .. ఒకప్పుడు పీకేకు ఎంతో కొంత విలువ ఇచ్చిన రాజకీయ పార్టీలు, నాయకులు  ఇప్పడు పీకేను తీ..తా  (తీతేసిన తహసిల్దార్ ) గానే చూస్తున్నాయని, రాజకీయ పార్టీల తీరును బట్టి తెలుస్తోంది.  అయినా జగన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరి పరిస్థితి ఒకేలా, డోలాయమానంగా ఉన్న నేపధ్యంలో  పీకే గడ్డి పోచను పట్టుకుని వేల్లాడుతున్నారు. 

అయితే, ప్రశాంత్ కిశోర్ వలన అటు  జగన్ రెడ్డికి కానీ, ఇటు కేసీఆర్ కు కానీ, పెద్దగా ఒరిగేది ఏమీ లేదు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా, ఇంకెప్పుడో జరిగినా ఫలితం మాత్రం ఒకటిగానే ఉంటుంది. అక్కడా  ఇక్కడా కూడా అధికార పార్టీలు ఓటమిని తప్పించుకోలేవని, సర్వేలు కాదు, సర్వ జనులు, సకల జనులూ చెపుతూనే ఉన్నారు.  గోడమీది రాతలే చెపుతున్నాయి. అది అందరికీ తెలుసు, అయినా అప్పుడప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు, పీకే సర్వేలంటూ లీకులీయడం తెరాస చాలా  కాలంగా చేస్తూనే వుంది. 

 ఇప్పడు తాజాగా  లీకు చేసిన సర్వే ప్రకారం, తెరాస తిరిగి ధికారంలోకి వస్తుందని డప్పు కొట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుదందని పీకే సర్వే తెలిపింది. ఇతరులపై ఆధారాపడాల్సిన అవసరం కూడా లేదని .. సొంత మెజార్టీ వస్తుందని కూడా పీకే సర్వే తేల్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని… ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ చాలా దూరంగా మూడో స్థానంలో ఉంటుందే, తప్ప రాష్ట్రం మొత్తం పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పీకే తేల్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. 

అయితే సర్వే లీక్ అయిన సమయ సందర్భాలను గమనిస్తే, వచ్చే నెల (జూలై) 2.3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే  బీజీపీ  జాతీయ కార్యవర్గ  సమావేశాల నాటికి తెరాస  సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, కొందరు సీనియర్ నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు, బీజేపీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. అంతే కాకుండా ఆ బాధ్యతను అమిత్ షా ఇంకెవరికి కాకుండా తెరాస ఇంటి గుట్టు మొత్తంగా తెలిసిన ఈటల రాజేందర్ కు అప్పగించారు. దీంతో అప్రమత్తమైన తెరాస నాయకత్వం, పీకే పేరున వండిన సర్వేను లీక్ చేసిందని, గులాబీ కోటలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. 

మరోవంక ప్రజల్లో  నిజంగా ఆగ్రహం ఉందంటే అది  ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. సర్వ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఅర్ మీద వుంది. మంత్రి పదవి కోసం విలువలను వదులుకున్న మరో కీలక మంత్రి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అది టీవీ తెరల మీద, సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  కేసేఅర్  కుటుంబ పాలన మీద ప్రజలో ఆగ్రహం వుంది. అసహనం వ్యక్తమవుతోంది. అయితే, బీజేపీ కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధాన ఎజెండాగా కాంపెయిన్ కు సిద్దమవుతున్న నేపధ్యంలో, ప్రజల దృష్టి  ఆ విషయం పై నుంచి తప్పించేందుకు, ఎమ్మెల్యేలను పీకే పేరున బకరాలను చేశారని  తెరాస వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉందని పీకే నివేదిక ఇచ్చారంటూ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూలత లేదని.. ఖచ్చితంగా వారిని మార్చాల్సిందేనని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఉండవని ముందుగానే సంకేతాలు పంపేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే, అందులో కొంత నిజం ఉన్నా, మొత్తంగా ప్రభుత్వం మీదనే అసంతృప్తి ఉందని కూడా సర్వే చెప్పిందని అంటున్నారు. అయితే, ఇది కూడా జిమ్మిక్కే అంటున్నారు.

నిజానికి, తెరాస ప్రభుత్వ వ్యతిరేకత , పీకే చెప్పినా చెప్పక పొయినా, పీక్ కు చేరిందనేది నిజం.అది రేషన్ కార్డులు,  కొత్త పింఛన్లు ఇస్తే పోయేది కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని సవాలు చేస్తున కుటుంబ పాలనకు, రాష్ట్రన్ని అప్పుల్లో ముంచెత్తి కూడ బెట్టిన కోట్ల కోట్ల అవినీతి, గురించి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే, పెద్ద గీత పక్కన చిన్న గీత  గీసి అసలు సమస్యల నుంచి ప్రజా దృష్టిని  దారి మళ్ళించేందుకే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే, తెరాస  పీకే పేరున సర్వే  లీక్ ను విడుదల చేసిందని, తెలంగాణ భవన్  కోడై కూస్తోంది.