టీటీడీ జంబో పాలకమండలిపై హైకోర్టులో పిల్..

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి నియామకంపై వివాదం ముదురుతోంది.  జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్‌ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని చెప్పారు.  హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు. 

టీటీడీ కొత్త బోర్డు ఎంపికపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టీటీడీ బోర్డు ఎంపికపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. భారీ ఎత్తున ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ సర్కారు టీటీడీ బోర్డు విషయంలో గతంలో ఎన్నడూలేని కొత్త సంస్కృతికి తెరదీసిందని ఆరోపించారు. సాధారణ బోర్డుకు అదనంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో టీటీడీ బోర్డును ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు.

హిందూ దేవాలయాల విషయంలో, ధార్మిక చింతనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి రాజకీయ చర్యలను తాము నిరసిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరామని వెల్లడించారు. ఈ మేరకు వినతిపత్రం అందించామని తెలిపారు. టీటీడీ అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని సోము వీర్రాజు చెప్పారు.