ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
posted on Oct 14, 2025 7:24PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఆయన iCloud ఖాతా పాస్‌వర్డ్ రీసెట్ చేసి, రాష్ట్ర పోలీసు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అందజేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అరెస్ట్ నుండి రక్షణను రద్దు చేయాలని కోరుతూ ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర తరఫున వాదిస్తూ, ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అందువల్ల విచారణలో ఆటంకం కలుగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ కోర్టును షాక్‌కు గురిచేసే కొన్ని విషయాలు నేను చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. మెహతా ఆరోపణల్లో భాగంగా, కోర్టు రక్షణలో ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మాట్ చేసి, కీలక ఆధారాలను నాశనం చేశారని తెలిపారు.
సీనియర్ అడ్వకేట్ దామ శేషాద్రి నాయుడు, ప్రభాకర్ రావు తరఫున వాదిస్తూ, ఈ ఆరోపణలను ఖండించారు. నా క్లయింట్ విచారణకు పూర్తి సహకారం అందించారు. ఆయనను 11 సార్లు పిలిచి, 18 గంటల పాటు విచారణ జరిపారు. ఆ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడింది. అందువల్ల ఆయన సహకరించారా లేదా అనేది ఆ రికార్డుల ద్వారానే తేలుతుందని అన్నారు.
పాత iCloud ఖాతా పాస్‌వర్డ్ ఆయన మరిచిపోయారు. పోలీసులు సమక్షంలోనే పాస్‌వర్డ్ రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ప్రైవసీ హక్కు పేరుతో తప్పించుకోవడం లేదు. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛకు తగిన విధంగా సహకరిస్తున్నాననీ పేర్కొన్నారు.
అయితే, న్యాయమూర్తి నాగరత్న డేటా డిలీషన్‌పై ప్రశ్నించారు. మీరు డివైసులు డిలీట్ చేశారు కదా? అని అడగగా, నాయుడు సమాధానంగా, అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. నేను డిలీట్ చేయలేదు, డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులే చేశారని తెలిపారు.