పెంపుడుజంతువుని బట్టి మనస్తత్వం

కొంతమందికి కుక్కపిల్లలంటే ఇష్టం. మరికొందరేమో పిల్లులంటే పడి చస్తారు. ఇంకొందరేమో చేపల్ని చూస్తూ జీవితాన్ని గడిపేస్తారు. లోకోభిన్నరుచి కదా! కానీ మనం ఇష్టపడే పెంపుడు జంతువులకీ, మన మస్తత్వానికీ మధ్య సంబంధం ఉందంటే నమ్మగలరా? మీరే చూడండి...

 

కుక్కలు : కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునేవారు మంచి చలాకీగా ఉంటారట. వీళ్లు బహర్ముఖులై (extroverts) ఉంటారనీ, ఇతరులతో త్వరగా కలిసిపోతారనీ అంటున్నారు. పట్టిన పట్టు విడవని మనస్తత్వం వీరి సొంతమట. వీళ్లతో ఉంటే కాలం సరదాసరదాగా గడిచిపోతుందంటున్నారు. నలుగురితో కాలక్షేపం చేయడం, విహారయాత్రలు చేయడమంటే వీరికి మహా ఇష్టం. పైకి ఇంత సరదా సరదాగా కనిపిస్తున్నా... నిబంధనలను పాటించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరని హామీ ఇస్తున్నారు.

 

పిల్లులు : కుక్కల్ని ఇష్టపడేవారు బహర్ముఖులైతే, పిల్లుల్ని పెంచుకోవడానికి మొగ్గు చూపేవారు అంతర్ముఖులుగా (introvert) ఉంటారని తేలింది. ఆ అంతర్ముఖత కారణంగా వారిలో సృజన ఎక్కువగా ఉంటుంది. ఉద్వేగమూ ఎక్కువగా ఉంటుంది. నలుగురూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక సొంత మార్గాన్ని ఎంచుకునే తత్వం వీరిలో ఉంటుంది.

 

పక్షులు : పక్షలని పెంచుకోవాలని తపించేవారిలో ఇతరుల పట్ల జాలి, కరుణ పొంగిపొర్లుతూ ఉంటాయట. వినయవిధేయతలు కూడా ఉట్టిపడుతూ ఉంటాయి. మనసులో మాటని వీరు ప్రభావవంతంగా చెప్పగలుగుతారట. బయట తిరిగేందుకు మహా ఇష్టపడతారట.

 

చేపలు: చేపలని తొట్టెలో చూసుకుంటూ మురిసిపోయేవారు అల్పసంతోషులై ఉంటారట. వీరిలో హాస్య చతురత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు! వీరు నిస్వార్థగుణం ఎక్కువగా ఉంటుందనీ, భవిష్యత్తు పట్ల నిరంతరం ఆశావహ దృక్పథంతో ఉంటారనీ చెబుతున్నారు.

 

పాకే జంతువులు (reptiles) : తాబేళ్లు, పాములులాంటి జీవుల్ని పెంచుకునేవారు చాలా విభిన్నంగా ఉంటారని తేలింది. ఇతరులతో పోలిస్తే చాలా స్వతంత్రంగా ప్రవర్తిస్తారట. చుట్టుపక్కలవారితో అంటీముట్టనట్లు ఉంటారట. వీరిలో హాస్య చతురత కూడా చాలా తక్కువగా ఉంటుందని తేలింది. వీరు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, దేనికెలా ప్రతిస్పందిస్తారో అంచనా వేయడం కూడా కష్టమేనని అంటున్నారు.

- నిర్జర.