ఈ వరుడి తోడి పెళ్లి కొడుకు ఓ కుక్క!

పెళ్లికి వెడుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్లు అన్నది సామెత. అయితే ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లికి పెంపుడు కుక్కను వెంట పెట్టుకు వచ్చాడు. పెంపుడు జంతువులపై అపారమైన ప్రేమ ఉండొచ్చు కాదనలేం. తాము ప్రేమగా పెంచుకుంటున్న జంతువును తమతో పాటే తిప్పుకోవాలని ఉంటుంది తప్పుపట్టలేం.

అయితే ఎంత ప్రేమగా పెంచుకుంటున్నా జంతువులను ఎక్కడికి తీసుకు వెళ్లాలి, ఎక్కడకు తీసుకు వెళ్లకూడదు అన్న విచక్షణ మాత్రం ఉండి తీరాలి. బస్సులు, రైళ్లలో  పెంపుడు జంతువులను తీసుకువెళ్లడం నిషేధం. వాటిని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేటప్పుడు బస్సులూ రైళ్లలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే శుభకార్యాలు జరిగే ఇళ్లల్లో వారి పెంపుడు కుక్కలు, పిల్లులు వంటి వాటిని ఆ శుభకార్యం జరిగే ప్రదేశంలోకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అది విధాయకం. ఎంత ప్రేమగా పెంచుకుంటున్నా జంతువుల వద్దకు వచ్చే సరికి మనుషులతో సమానంగా వాటికి స్థానం కల్పించే విషయంలో ఒకిన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సహజం

కానీ మధ్య ప్రదేశ్ లో ఓ వరుడు ఏకంగా పెళ్లి మంటపానికి తన పెంపుడు కుక్కతో వచ్చాడు. సాధారణంగా కారులోనో.. లేదా వారి వారి సంప్రదాయల ప్రకారం పళ్లకిలోనో, గుర్రంపైనో వరుడు కల్యాణ మంటపానికి రావడం సహజం. అయితే ఈ వరుడు మాత్రం బైక్ పై అదీ తన పెంపుడు శునకంతో సహా వచ్చేశాడు. అతడి పైత్యం అక్కడితో ఆగలేదు. తన పెళ్లికి తాను కొత్త బట్టలు ధరించి రావడమే కాకుండా.. తన తోడు పెళ్లి కొడుకు కుక్కేనంటూ దానికి కూడా కొత్త బట్టలు తొడిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పాటు.. ఇదే పని బ్రో ఎంత పెంపుడు కుక్కపై ప్రేమ ఉన్నా ఇలా పెళ్లి మంటపానికి తోడ్కోని రావడం ఎబ్బెట్టుగా ఉందంటూ విమర్శలూ చేశారు.