పేర్ని నానికి పరాభవం.. అయినా నోరెత్తితే ఒట్టు!
posted on Nov 20, 2025 2:56PM

ప్రస్తుతం వైసీపీలో నోరున్న ఒకే ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతున్న పేర్ని నానికి ఘోర పరాభవం ఎదురైంది. మామూలుగా అయితే నోరేసుకుపడిపోయే పేర్ని నాని ఈ సారి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. నోరెత్తి ప్రశ్నించలేదు. ఇంతకీ పేర్ని నానికి పరాభవం ఎక్కడ ఎదురైందంటున్నారా? అక్కడికే వస్తున్నాం..
వైసీపీ అధినేత జగన్ దాదాపు ఆరేళ్ల తరువాత తొలి సారిగా అక్రమాస్తుల కేసు విచారణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గురువారం (నవంబర్ 19) హాజరయ్యారు. తాడేపల్లి నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని అక్కడ నుంచి గంటకు ఎనిమిది లక్షలు చెల్లించి మరీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్ద కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ జమ అయ్యింది. అయితే కోర్టు ఆవరణలోకి జగన్ ను మాత్రమే అనుమతించారు. ఇక ఎవరినీ ఎంటర్ కానీయలేదు. అలా పోలీసులు ఆపేసిన వారిలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు.
మామూలుగా అయితే తనను నిలువరించిన పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగాలి. కానీ ఎందుకో.. నోరెత్తలేదు. కోర్టు పరిసరాల్లో మాట్లాడితే అక్కడికక్కడే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేస్తారని భయపడినట్లున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది పక్కన పెడితే.. తనను పోలీసులు నిలిపివేసినా పేర్ని నాని మాత్రం దాదాపు అరగంటకు పైన కోర్టు బయట అలాగే నిలబడి ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తై జగన్ బయటకు వచ్చే వరకూ నోరెత్తకుండా నిలుచున్నారు. అయితే బయట పెద్ద ఎత్తున గుమిగూడిన వైసీపీయేలు మాత్రం రప్పరప్ప ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారనుకోండి అది వేరే సంగతి.