పెద్దిరెడ్డి భార్య పేరిట చెరువు భూమి!
posted on Jul 30, 2024 1:56PM
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భార్య స్వర్ణలత అసైన్డ్ పట్టా కింద ఐదెకరాల చెరువు భూమి పొందినట్లు ప్రభుత్వ రికార్డులలో వివరాలు సమగ్రంగా వున్నాయి. స్వర్ణలత స్వగ్రామం అన్నమయ్య జిల్లా వీరబల్లి. ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 2139 కింద ఆమె పేరిట 5 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. దీనిని భూమి వివరణ కింద చెరువుగా చూపిస్తోంది. ఈ వర్షాధార భూమిని 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వ భూములను అసైన్డ్ పట్టాల రూపంలో భూమి ఇస్తారు. ఇలాంటి భూమి 20 ఏళ్ల పాటు వారి అధీనంలోనే ఉన్నట్లయితే క్రయవిక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటన అనంతరం ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 ఏళ్ల పాటు అధీనంలో లేని భూమిని సైతం ఫ్రీ హోల్డు పెట్టేసినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. దీనిపై విచారణతోపాటు పూర్తి అధ్యయనానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో వీరబల్లిలో అసైన్డ్ భూమి వ్యవహారం తెరపైకి వచ్చింది. స్వర్ణలత పేరిట మదనపల్లె మండలం వలసపల్లె, బండమీద కమ్మపల్లెలో పెద్దఎత్తున పొలాలున్నాయి. మదనపల్లెతో ఎలాంటి సంబంధం లేకున్నా అక్కడ భూములు కలిగి ఉండడం, ల్యాండ్ కన్వర్షన్‌కి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.