ద‌మ్ముంటే ఎన్నికలకు వెళ్దామా? సీఎంకు పీసీసీ చీఫ్‌ ఛాలెంజ్..

ప్ర‌తిప‌క్షం ఎంత బ‌లంగా ఉంటే.. పాల‌కుల‌కు అంత‌గా టెన్ష‌న్‌. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడు ఎంత దూకుడుగా ఉంటే ముఖ్య‌మంత్రికి అంత‌గా ముచ్చెమ‌ట‌లు త‌ప్ప‌వు. అధికారంలో ఉన్నామ‌నే ఆనందంకంటే.. ఎందుకు సీఎం సీట్లో ఉన్నామా అనే ఆందోళ‌నే ఎక్కువ‌గా ఉంటుంది. దిన‌దిన‌గండం.. ఐదేళ్ల పాల‌న‌గా సాగుతుంటుంది. తెలంగాణ‌లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో అలాంటి ప‌రిస్థితే ఉందంటున్నారు. తెలంగాణ మాదిరే.. క‌ర్ణాట‌క‌లోనూ ప్ర‌తిప‌క్షానికి బ‌ల‌మైన నాయ‌కుడు ఉన్నారు. క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ మ‌హా ప‌వ‌ర్‌ఫుల్‌. అందుకే, అధికార బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా, క‌ర్ణాట‌కలో ముఖ్య‌మంత్రి మార్పు వార్త‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు వెళ్దామా అంటూ డీకే స‌వాల్ విస‌ర‌డం సంచ‌ల‌నంగా మారింది. 

కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు జరగబోతున్నాయంటూ వస్తున్న వార్తలతో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని, దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని మండిప‌డ్డారు. ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.

‘‘ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదు. వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు రాజకీయాలు మాత్రమే కావాలి. యడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ముందుకు వెళ్దాం. ప్రజలనే తీర్పు ఇస్తారు. ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సిద్ధమేనా?’’ అని డీకే సవాల్ విసిరారు.

రాష్ట్రంలో వరదలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీకే ప్రశ్నించారు. కర్ణాటకకు ప్రధాని ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర పరిస్థితిని బాగు పర్చడానికి ఒక్క ఎంపీకి సామర్థ్యం లేదని డీకే విమర్శించారు.

డీకే పీసీసీ చీఫ్ అయ్యాక‌ క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తోంది. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్‌దే గెలుప‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఎల‌క్ష‌న్స్‌కి వెళ్దామా అంటూ డీకే స‌వాల్ విసిరారు. సేమ్ టూ సేమ్ తెలంగాణ‌లోనూ అలాంటి ప‌రిస్థితే ఉందంటున్నారు. డీకే లానే రేవంత్‌రెడ్డి సైతం డైన‌మిక్ లీడ‌ర్‌. రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాక కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో క‌ద‌నోత్సాహంతో ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది కాంగ్రెస్ పార్టీ.