కమలంతో పవన్ కల్యాణ్ కటీఫేనా? ఉద్యమ కార్యాచరణ అందుకేనా? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. సీఎం జగన్ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ప్రభుత్వాన్ని మార్చేద్దామా అని చూస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక పార్టీల వ్యూహాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఏపీలో బీజేపీతో ప్రస్తుతం జనసేన పార్టీ పొత్తులో ఉంది. కాని ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తన స్టాండ్ మార్చుకునే  యోచనలో ఉన్నారని తెలుస్తోంది. 

బీజేపీతో జనసేన కటీఫ్ చేసుకుంటుందనే ప్రచారమే చాలా కాలంగా సాగుతోంది. కాని బీజేపీ నేతలు మాత్రం ఖండిస్తూ వస్తున్నారు. తమపై పవన్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ రాగానే... కొందరు కమలం నేతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపి కూల్ చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పవన్ నిర్ణయంతో ఆయన బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునే పనిలో ఉన్నారనే సంకేతం వస్తోంది. 

ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు  భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విభజనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి సాయం చేయపోగా.. గతంలో ఉన్న ప్రాజెక్టులకు కొర్రీలు పెడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పోరాటం కూడా చేస్తున్నారు. బీజేపీ పొత్తులో ఉండటంతో ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దూకుడుగా వెళ్లలేదు పవన్ కల్యాణ్. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించాలని నిర్ణయించారు పవన్ కల్యాణ్. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఉద్యమ గోదాలో దిగనున్నట్లు స్పష్టం చేయటమే కాదు.. దానికి సంబంధించిన భారీ ప్రణాళికను విడుదల చేశారు పవన్ కల్యాణ్. 

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలన్న డిమాండ్ తో పాటు.. ఉక్కు కర్మాగారం భావోద్వేగాలతో ముడి పడి ఉందన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. నిర్వాసితుల బాధలు.. కష్టాలు తనకు తెలుసన్న ఆయన.. ఆ దిశగా తాము పోరాడతామన్న విషయాన్ని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ ను విడుదల చేశారు.  విశాఖ ఉక్కు అంశం మీద తనకు తాను బరిలోకి దిగుతానని ప్రకటించడం ద్వారా జనసేనాని తన భవిష్యత్ కార్యాచరణను చెప్పేశారనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించడం అంటే బీజేపీపై పోరాటమే. కమలంతో కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ పొత్తు విషయంలో ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతల నుంచి పవన్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది.