ప్లీన‌రీ పాసుల కోసం గులాబీ లొల్లి.. న‌గ‌ర‌మా? ఫ్లెక్సీల మ‌య‌మా?

సామాన్యులకో రూల్‌.. అధికార పార్టీకి మ‌రో రూలా? హైద‌రాబాద్‌లో ఇంటి గేటుకు టు-లెట్ బోర్డు పెడితినే ఫైన్లు వేస్తూ జీహెచ్ఎమ్‌సీ అధికారులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ మాత్రం న‌గ‌ర‌మంతా ఫ్లెక్సీల‌తో, కేసీఆర్ క‌టౌట్ల‌తో, గులాబీ జెండాల‌తో నింపేస్తే ప‌ట్టించుకోరా? హైకోర్టు అంత సీరియ‌స్‌గా చెప్పినా.. రూల్స్ ఫ‌క్కాగా ఉన్న ప్ర‌భుత్వ పార్టీకి పాల‌నా యంత్రాంగం మ‌రీ ఇంత‌లా కొమ్ముకాయ‌డమేంటి? ఒక‌టా..రెండా.. హైద‌రాబాద్ మొత్తం.. ఏ ఏరియాలో చూసినా.. ఏ గ‌ల్లీకి వెళ్లినా.. గులాబీ మ‌య‌మే. ఇంత‌లా ఓపెన్‌గా ఫ్లెక్సీలు, జెండాలు క‌నిపిస్తున్నా.. బ‌ల్దియా సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కూ వాటిని ట‌చ్ చేయ‌క‌పోవ‌డం.. వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణం. ప్లీన‌రీ మొత్తం ముగిసాక‌.. ప‌ని అయిపోయాక‌.. తీరిగ్గా రేపో ఎల్లుండో తీసేస్తారు కాబోలు. ఏదో నామిన‌ల్‌గా ల‌క్షో, ప‌ది ల‌క్ష‌లో ఫైన్ వేసి.. చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌వ‌రింగ్ ఇస్తారు కాబోలు. అద‌లా ఉంటే....

ఇక‌.. గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తుండ‌టంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఈసారి ప్లీనరీ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇవ్వడం.. కేవ‌లం 6 వేల మందికి మాత్ర‌మే ఆహ్వానాలు పంప‌డంతో గులాబీ కార్య‌క‌ర్తలు గొడ‌వ‌కు దిగుతున్నారు. మాకంటే మాకు పాసులు కావాలంటూ లోక‌ల్ లీడ‌ర్ల‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప‌రిణౄమం  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారింది. పాస్‌ల కోసం ముఖ్య కార్యకర్తలు పోటీపడడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. 

ఇక కేసీఆర్ దావ‌త్ ఇస్తే ఎట్టా ఉంటాదో తెలియాలంటే టీఆర్ఎస్ ప్లీన‌రీకి వెళ్లాల్సిందే. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ సహా మొత్తం 33 రకాల వంటకాలు రెడీ చేశారు. మ‌ధ్యాహ్నం కాగానే లొట్ట‌లేసుకుంటూ తిన‌డ‌మే త‌రువాయి.

ఇక సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వ‌ర్యంలో 2,200మంది సిబ్బందితో గ‌ట్టి పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటైంది. ప్లీనరీకి భారీ సంఖ్యలో వాహనాలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.