ఇటు ఉగ్ర దాడులు.. అటు టీ20 మ్యాచ్‌లు.. మోదీపై విమ‌ర్శ‌లు..

క‌శ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. బోర్డ‌ర్‌లో కాల్పుల‌కు స్వ‌స్తి ప‌లికి.. క‌శ్మీర్ గ్రామాల్లో తుపాకుల‌కు ప‌ని చెబుతున్నారు. సామాన్య పౌరులే టార్గెట్‌గా తూటాలు పేలుస్తున్నారు. వారి ఐడెంటిటీ క‌నుక్కొని, స్థానికేత‌రుల‌ను గుర్తించి.. ప‌క్కాగా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల దాడిలో ఏకంగా ఐదుగురు భార‌త జ‌వాన్లు చ‌నిపోవ‌డం మ‌రింత క‌ల‌క‌లంగా మారింది. ఓవైపు పాకిస్తాన్ ఇంత‌లా ఉగ్ర‌దాడుల‌తో రెచ్చిపోతుంటే.. మ‌రోవైపు త్వ‌ర‌లో జ‌రిగే టీ20 క‌ప్‌లో ఆ దేశంతో క‌లిసి క్రికెట్ ఆడేందుకు టీమిండియా సిద్ధ‌మ‌వుతుండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అద‌నుగా ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డుతున్నాయి.

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిది మంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్‌ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్‌ 24న పాకిస్థాన్‌తో భారత్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?’ అని ఒవైసీ నిల‌దీశారు.