పూర్తి భిన్నంగా ఒమిక్రాన్ లక్షణాలు.. జాగ్రత్తగా లేకుంటే గండమే!

కరోనాతో అతలాకుతలమైన ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ గడగడలాడిస్తోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్. కోవిడ్ 19 వైరస్ తన రూపం మార్చుకుని ఒమిక్రాన్ వైరస్ గా మారి దాడి చేస్తోంది. ఒమిక్రాన్ వైరస్ 6 రెట్ల వేగంతో సంక్రమిస్తోందని వైద్య నిపుణుల పరిశీలనలో వెల్లడైంది.

డెల్టా వైరస్తో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తున్న లక్షణాలు తలనొప్పి, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులకు సాధారణ జలుబు తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే మరింత ఎక్కువ మందికి ఒమిక్రాన్ విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈ లక్షణాల వల్ల బాధితుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు.

ఈ లక్షణాల కారణంగా ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఒమిక్రాన్ లక్షణాలు కనిపించిన వారెవరైనా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రస్తుత పాండమిక్ సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. డెల్టా వేరియంట్ బాధితుల్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు, రుచి, వాసన కోల్పోయిన లక్షణాలు కనిపిస్తాయి. ఒమిక్రాన్ తీవ్రతపై ఇంకా పూర్తి అవగాహన ఇంకా రాని కారణంగా స్పష్టత లేందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచంపై అది ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు ఒమిక్రాన్ పాకిందనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు 941 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఒక్క దక్షిణాఫ్రికాలోనే 228 మందికి ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వేలో 50, అమెరికాలో 39 కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో కూడా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మాసాచుసెట్స్, వాషింగ్టన్ లో కూడా కొత్తగా ఒమిక్రాన్ కేసులు కనిపించాయి. అంతకు ముందే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్, మిసోరి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరాడో, ఉటాలో కూడా ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

మరో పక్కన భారతదేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా విస్తరిస్తోంది. తొలిరోజు బెంగళూరులో 2 కేసులు, మరుసటి రోజున మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్, ముంబై, ఢిల్లీలో ఒక్కో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి న్యూఢిల్లీ చేరిన వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకింది. కొద్ది రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ వచ్చిన 72 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. మరో పక్కన విదేశాల నుంచి ముంబై వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. భారత్ లో ఇప్పటి వరకు 21 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.