చితిని పేర్చుకుని సజీవదహనం! సీఎం జిల్లాలో ఘోరం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో ఘోరం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ నిర్వాసితుడు  సజీవ దహనం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్ లో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.  

తొగుట మండలం, వేముల‌ఘాట్ కు చెందిన మల్లారెడ్డి (70) భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. కూతురు కుమారుడు, మనవడు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు. మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు.  మల్లారెడ్డి అందులో జీవించసాగాడు.  కానీ…. ఒంటరి వాడు అనే కారణంతో ఇచ్చిన ఇంటిని  అధికారులు వెనక్కు తీసుకున్నారు.

అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.  గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని… కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. మల్లారెడ్డి  మనవడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో  మల్లారెడ్డి... తన ఇంట్లోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. 

సిద్దిపేటజిల్లా వేములఘాట్ లో  సూసైడ్ చేసుకున్న  మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రఘునందన్ రావు ఫైరయ్యారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని రఘునందన్ రావు ఆరోపించారు.  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదనే మనోవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు.