ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తుగ్లక్ నిర్ణయం.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు

పాలకుడు మూర్ఖుడైతే పాలకులకు కష్టాలు తప్పవన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశుడైతే సమాజంలోని అన్ని వర్గాలూ ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లేకుండా చేసి విద్యార్థులను, యువతను అష్టకష్టాల పాలు చేసిన జగన్, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో వైద్య విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారు. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మార్చుతూ శాసనసభ ఆమోదించిన బిల్లు కు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా  తిరస్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎస్ ఎఫ్ ఐ వివిధ  రాజకీయ పార్టీలు, విద్యార్థి - యువజన - కార్మిక సంఘాల రాష్ట్ర నేతలతో శనివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలందరూ ముక్తకంఠంతో జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.  రాజకీయ అంశాన్ని కాకుండా సాంకేతికంగా కూడా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్లక్ నిర్ణయమేనని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ పై అభిమానం, వైఎస్ పై దురభిమానం అన్న అంశాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం  ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుబంధ విద్యా సంస్థల్లో   విద్యార్థులుగా ఉన్న వారి భవిష్యత్ తో చెలగాటమాడడమేనని విమర్శించారు. ఐదేళ్ళు వైద్య విద్యను అభ్యసించిన   విద్యార్థులు రెండు పేర్లతో ఉన్న యూనివర్సిటీ సర్టిఫికెట్ల తో భవిష్యత్ లో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ విశ్వ విద్యాలయంలో గతంలో వైద్య విద్యనభ్యసించిన వారు ముందు ముందు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి అనివార్యమౌతుందని ఆందోళణ వ్యక్తం చేశారు.  ఎందు కంటే విదేశాల్లో వారి వైద్య పట్టాకు ప్రాధాన్యత దక్కదని ఇన్ని సమస్యలను తెచ్చిపెట్టే పేరు మార్పు తుగ్లక్ చర్య కాక మరేమౌతుందని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.   సంక్షేమ పథకాలకు ఇప్పటి ప్రభుత్వం పెట్టుకొన్న పేర్లను   తర్వాత వచ్చే ప్రభుత్వం తొలగించినా లేదా గత ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఇప్పటి ప్రభుత్వం తొలగించినా ఆ పథకాలు కొనసాగినంత కాలం ఎటువంటి సమస్యా తలెత్తదు కానీ, విశ్వవిద్యాలయాల పేర్లను ఇలా రాజకీయ ప్రయోజనం కోసమే, కక్ష సాధింపు కోసమే, అయిష్టత కారణంగానో ఆషామాషీగా మార్చేస్తే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠా మసకబారుతుందని, అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం సరికాదనీ, ఆయన విజ్ణతతో నిర్ణయం తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు.  ఎన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని రాజకీయ దృష్టితో కాకుండా, ప్రజాప్రయోజనం దృష్టితో ఆలోచించి, చారిత్రక కోణంలో పరిశీలించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనీ, ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం చరిత్రను అగౌరపరిచేలా ఉందనీ, దీనివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు పేర్కొన్నారు.  అంతే కాకుండా ఆ యూనివర్సిటీ  అనుబంధ విద్యా సంస్థల్లో  చదువుకుంటున్న వారి భవిష్యత్ తో ఈ నిర్ణయం చెలగాటమడటమేనని అన్నారు.  విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, ప్రతిష్ట , వైద్య విద్యా ప్రమాణాలు, వైద్య విద్యా రంగంలో పరిశోధనలపై ప్రభుత్వానికి దృష్టి లేని ప్రభుత్వం పేరు మార్పు విషయంలో తొందరపడటం రాజకీయ ప్రయోజనాలను ఆశించే తప్ప మరో కారణం కనిపించడం లేదన్నారు.  డాక్టర్ ఎన్టీఆర్  ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఒక చరిత్ర ఉంది. ఆ వర్సిటీ  ఎన్.టి.ఆర్. మానస పుత్రిక.  నైతిక విలువలతో కూడిన వైద్య విద్య అందించడం, సమర్థులైన పట్టభద్రులను తయారు చేయడం, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంబంధిత విభాగాలను అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో ఎన్టీఆర్ నెలకొల్పిన విద్యాలయం అది. 1986లో ఈ వర్సిటీ    27 అనుబంధ కళాశాలలతో మొదలైంది.  2019-20 విద్యా సంవత్సరం ఈ వర్సిటీ అనుబంధ కాలేజీల సంఖ్య నాటికి 298 పెరిగింది. రాష్ట్రంలో  ఆంధ్రా విశ్వ విద్యాలయం, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహ, ఆదికవి నన్నయ్య  యూనివర్సిటీలు, ఆచార్య యన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలా ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది.   వాటి పేర్లు మార్చగలరా? మారిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్ధిస్తుందా!  ఇడుపులపాయలోనే ఉన్న ట్రిబుల్ ఐటి  పేరు మారుస్తారా? అలాగే డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మార్చగలరా?  అని ప్రశ్నించారు.