నిమ్మకూరులో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు, హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాల కృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిమ్మకూరులో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు వాడి, వేడిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తెలుగు భాష ఉన్నంత వరకూ ప్రతి తెలుగువాడి గుండెల్లో చరస్థాయిగా నిలిచిపోతారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ ఆశీస్సులు సదా ఉంటాయన్నారు. కాగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో  ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తండ్రికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించనున్నారని చెప్పారు. ఈ విషయమై కేంద్ర రిజర్వ్ బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది మే వరకూ నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలోని 12 కేంద్రాలలో నిర్వహిచే ఉత్సవాల కోసం బాలకృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిపుణులను సత్కరించనున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.