బాలయ్య ఫైర్ జగన్ రెడ్డి షేక్ ఆగని పేరు మార్పు ప్రకంపనలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిజానికి రాష్ట్రంలోనే కాదు, జాతీయ  స్థాయిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ మీడియా ఇదే వార్తను ప్రధాన వార్తగా ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ కుమారుడు, నటుడు , హిందూపురం ఎమ్మెల్యే, అభిమానులు బాలయ్య బాబుగా పిలుచుకునే నందమూరి బాల కృష్ణ, స్పందనను జాతీయ మీడియా ప్రముఖంగా, పదే పదే ప్రసారం చేస్తోంది. ఆయన చేసిన ఘాటు విమర్శలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. 

విదేశాల్లో ఉండడం వలన వెంటనే స్పందిచలేని బాలయ్య నిన్న శనివారం(సెప్టెంబర్24) జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. కేవలం యూనివర్సిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదని... ఆయనను ప్రజల మనసుల్లోంచి చెరిపివేయలేరని. మహనీయుడి పేరు మార్చిన మిమ్మల్ని  మార్చడానికి ప్రజలు సిద్దంగా వున్నారని బాలయ్య చేసిన హెచ్చరిక  ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక  జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు గౌరవాలను గుర్తు చేస్తూ మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు జాతీయ పార్టీల నాయకులను కదిలిస్తున్నాయి. జాతీయ నాయకుల స్పందనలు జగన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 

నిజానికి, కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ముఖ్యమంత్రులను పదేపదే మారుస్తూ, ఆంద్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఎంత తప్పు చేసిందో జగన్ రెడ్డికి తెలియక పోవచ్చును. కానీ, ఒక్కసారి చరిత్రను గుర్తు చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న దురహంకార నిర్ణయమే,ఆ పార్టీని భూస్తాపితం చేసింది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ప్రజల, తెలుగు వారి ఆత్మ గౌరవానికి చెరగని చిరునామాగా నిలిచిన ఎన్టీఆర్ ని అవమానించిన జగన్ రెడ్డిని ఎప్పటికీ క్షమించరు. ఇది ఎవరో ఒకరిద్దరు అంటున్న మాట, కాదు.  మొత్తం తెలుగువారి ఆత్మ ఘోష. నిజం, పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండి అన్నట్లుగా జగన్ రెడ్డి దురహంకారంతో తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు. బాధ పడుతున్నారు.   

నిజానికి, ఎన్టీఆర్ అంటే బాలయ్య అన్నట్లుగా, ఒక వ్యక్తి కాదు, ఒక పేరు కాదు, అదొక  సంస్కృతి.. ఓ నాగరికత, ఇంకా చెప్పాలంటే ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవానికి శాశ్వత చిరునామా. అవును, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్. జగన్ రెడ్డి మరిచి పోవచ్చును కానీ, ఎంతో ఘన చరిత్ర ఉన్న తల్లి కాంగ్రెస్ పార్టీనే  కేవలం 11 నెలల కాలంలో కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసిన  మహా నాయకుడు, ఎన్టీఆర్. అందుకే, తల్లి కాంగ్రెస్ కు పట్టిన గతే పిల్ల కాంగ్రెస్ కు తప్పదని అంటున్నారు. అలాగే,  వైఎస్సార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు అదే దారిలో  జగన్ రెడ్డి ఎన్టీఆర్ విద్యాలయం పేరు, మార్చారు. అందుకు వైఎస్సారే కాదు , కాంగ్రెస్ పార్టీ కూడా మూల్యం చెల్లించింది. ఇప్పుడు జగన్ రెడ్డి, వైసీపీ వంతు వచ్చిందని, ప్రజలు అంటున్నారు.  అవును, బాలయ్య అన్నట్లుగా, ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్నే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు..అయితే ఈ విషయాన్ని,జగన్ రెడ్డి చూడలేక పోతున్నారు. బహుశా, దురహంకారపు పొరలు ఆయన చూపును పక్క దారి పట్టిస్తున్నాయి కావచ్చును. అయినా, జగన్ రెడ్డి చేసిన తప్పు సామాన్యమైన తప్పు కాదు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే తప్పు జగన్ రెడ్డి చేశారు. అందుకు ఆయన మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషకులే కాదు, వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. 

నిజానికి, వైసీపీలోనూ ముఖ్యమంత్రి తాబేదార్లు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్న మంత్రులు, ఇతర నేతలు కొద్ది మంది మాత్రమే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. మిగిలిన మంత్ర్రులు ఇతర నేతలు మింగలేక కక్కలేక మధన పడుతున్నారు. నిజానికి, మూడొంతుల వరకు మంత్ర్రులు, ఎమ్మెల్యేలు కూడా, జగన్ రెడ్డి నిర్ణయాన్ని ఛీ కొడుతున్నారని, వైసీపీ నాయకులే గుస గుసగుసలాడుతున్నారు.  

ఎవరి దాకానో ఎందుకు, అదే  వైఎస్సార్ రక్తం పంచుకు పుట్టిన జగన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల, అన్న ముఖాన,... ఛీ కొట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి, తమ తండ్రి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని షర్మిల తప్పు పట్టారు. జగన్ రెడ్డి అవమానించింది ఒక్క ఎన్టీఅర్ నే కాదు, తండ్రి వైఎస్సార్ ను కూడా అవమానించారనే అర్ధం వచ్చేలా షర్మిల తమదైన రీతిన  ఫైరయ్యారు. చీవాట్లు పెట్టారు. అధికారం ఉంది కదాని, వైఎస్సార్ పేరున అడ్డమైన పనులు చేస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుందని  షర్మిలే కాదు వైఎస్సార్ అభిమానులు, ఆత్మీయులు కూడా ఆక్షేపిస్తున్నారు.

అధికారం శాశ్వతం కాదు. రేపు అధికారం చేతులు మారిన తర్వాత వైఎస్సార్ పేరును అవమాన పరిచేలా జగన్ రెడ్డి నిర్ణయం ఉందని, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు, నిజానికి, రాజకీయ నాయకులకు ఉండకూడని, లక్షణాలలో మొదటిది అహంకారం. కానీ  అదేమీ దురదృష్టమో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వళ్ళంతా ఉన్నదే ఆదని అంటారు. ఈ దురహంకారంతోనే జగన్ రెడ్డి ఎవరిని తాక కూడదో, ఎవరిని తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా చూస్తారో ఆ,మహనీయుని తాకారు.. అందుకే, ఈ రోజు  రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడి గుండె భగ్గుమంటోంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఇప్పటికే భగ్గుమంటున్న ప్రజాగ్రహం ఇప్పడు,మరింతగా రగులుతోందని, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని   సాగనంపే సుముహూర్తం కోసం ప్రజలు ఎదురు చూస్తునారని, అంటున్నారు. నిజం, తెలుగు ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం క్షమించరు. అందులోనూ అన్న ఎన్టీఆర్ ను అవమాన పరిస్తే అసలే క్షమించరని , అంటున్నారు.