చైతన్య మూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎన్టీఆర్ శత జయంతి నేడు

ఎన్టీఆర్ ఒక చైతన్యం
ఎన్టీఆర్ ఒక ఉత్సాహం
ఎన్టీఆర్ ఒక ఉద్వేగం


ఎన్టీఆర్ పేరు వింటేనే ప్రతి తెలుగు వాడిలో ఓ పులకింత. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా, సంక్షేమ సారథిగా, పేదవాడి చేతి అన్నంముద్దగా, మహోన్నత మానవతా మూర్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్న నిలువెత్తు చైతన్యం ఎన్టీరామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఒక సంచలనం. తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన తొమ్మది నెలలోనే నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఘనత ఎన్టీఆర్ దే.

తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో హస్తిన అధికార పీఠాన్ని గడగడలాడించిన ఎన్టీఆర్.. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని నింపిన ప్రజాస్వామ్య వాది. పేదవాడి సంక్షేమమే దేశానికి సుభిక్షం అని నమ్మి పేదల అభ్యున్నతి కోసం నిరంతరం తపించిన సంక్షేమ సారథి. మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించిన మహోన్నతుడు.   అలాంటి ఎన్టీఆర్ శత జయంతి నేడు ( మే 28).  ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, యావత్ తెలుగువారికీ పండుగ రోజు.