తెలంగాణలో ఇప్పుడు షర్మిల టైమ్

ఒకే ఒక్క ఘటన వైఎస్ షర్మిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం నివాసం ప్రగతి భవన్ కు వెళ్తున్న షర్మిలను కారులోనే ఉంచి, టోయింగ్ మిషన్ తో లాక్కెళ్లి, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి, రాత్రికి కోర్టులో ప్రవేశపెట్టే దాకా.. ఆపైన ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసేదాకా జరిగిన ఎపిసోడ్ తో షర్మిలకు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలు మొదలు రాష్ట్రస్థాయి నేతలు.. మరీ ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై నుంచి కూడా మద్దతు లభించింది.

ఏడాదిన్నర క్రితం తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలే టార్గెట్ గా కొంత కాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తునా.. ఏడాది క్రితం నుంచి తెలంగాణ గ్రామాల్లో పాదయాత్రగా వెళ్తున్నా.. మంగళవారాల్లో ‘నిరుద్యోగ దీక్ష’లు చేస్తున్నా.. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నిత్యం ఆరోపణలు చేస్తున్నా.. ఢిల్లీ వెళ్లి సీబీఐకి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు ఫిర్యాదు చేసినా రానంత మైలేజ్ ఈ ఒక్క ఘటనతోనే షర్మిలకు వచ్చింది.

షర్మిల కారులో ఉండగానే.. టోయింగ్ వాహనానికి కట్టి ఆమెను తీసుకెళ్లిన పోలీసులపైన, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పక్కన కోర్టు అనుమతితో నిర్మల్ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిష్టాత్మంగా చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర కన్నా వైఎస్ షర్మిలకే ఎక్కువ మైలేజ్ రావడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. ఆ వెంటనే బండి సంజయ్ స్పందించారు. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన తీరు, ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి, పోలీస్ స్టేషన్ లో దురుసుగా తీసుకెళ్లిన తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్రం మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును, పోలీసుల వ్యవహార సరళిని తప్పుపట్టారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ లో విభేదాల కారణంగా కుతకుతలాడుతున్న గవర్నర్ తమిళిసై కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఒక మహిళను, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల పట్ల పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదంటూ ట్వీట్ చేస్తూ.. ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, కొండా సురేఖ కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు.

షర్మిలను అరెస్ట్ చేసిన తీరును, టోయింగ్ వాహనం ద్వారా ఆమె లోపలే ఉండగా కారును టోయింగ్ చేసుకెళ్లిన వైనాన్ని జాతీయ స్థాయిలో కూడా మీడియా ప్రసారం అయింది. షర్మిల కారులో ఉండగానే లాగడంపైన ఇప్పుడు నేతలంతా స్పందిస్తున్నారు. వైఎస్ షర్మిలకు తెలంగాణలో ఆదరణ ఏ మేరకు ఉంది? ఆమెకు ఎంత మేరకు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారని సమాచారం. తెలంగాణలో పాగా వేయాలనే టార్గెట్ తో శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కేసీఆర్ పై పోరాటం చేసే ఎవరికైనా మద్దతిచ్చేందుక రెడీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య తాజాగా ట్వీట్ల వార్ జరుగుతోంది. ‘తాము వదిలిన బాణం.. తాన అంటే తందాన అంటున్న తామరపువ్వులు’ అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ ను షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ ట్వీట్ చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల కారవాన్ కు నిప్పంటించడంతో పాటు ఆమె కాన్వాయ్ లోని వాహనాలను టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేయడం.. శాంతి భద్రతల సమస్య పేరుతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి, ఆపైన హైదరాబాద్ తీసుకురావడం, ఆ తర్వాతి రోజు షర్మిల ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు రావడం, కారులోనే షర్మిల ఉండగా కారుతో సహా టోయింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఒక్కసారిగా షర్మిలకు మైలేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక కోర్టు అనుమతి ఇవ్వడంతో పాదయాత్ర ఆగిన చోటు నుంచే మళ్లీ యాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించడం గమనార్హం.