బెలార‌స్ మాన‌వ‌హ‌క్కుల నాయ‌కునికి నోబెల్‌

ప్ర‌స్తుతం జైల్లో ఉన్న బెలార‌స్ మాన‌వ‌హ‌క్కుల నాయ‌కుడు అలెస్ బియాలియ‌ట్స్కీ, ర‌ష్యా మాన‌వ హ‌క్కుల సంస్థ‌, ఉక్రెయిన్ మాన‌వ‌హ‌క్కుల కేంద్రం 2022 సంవ‌త్స‌రం నోబెల్ శాంతి  బ‌హుమ‌తికి ఎంపిక‌యిన‌ట్టు ఓస్లోలోని నోబెల్సంస్థ ప్ర‌క‌టించింది. అలెస్ మ‌రియు శాంతి బ‌హుమ‌తి అందుకోనున్న ఆ రెండు సంస్థ‌లూ త‌మ త‌మ ప్రాంతాల్లో పౌర‌హ‌క్కులు, ప్ర‌జ‌లు ఎద‌ర్కొంటున్న వ్య‌వ‌స్థాగ‌త స‌మ‌స్య‌ల గురించి పోరాడ‌టంలో ఎంతో కృషి చేసిన‌ట్టు నోబెల్ సంస్థ  త‌న ట్విట‌ర్‌లో  వివ‌రించింది. కాగా అలెస్‌ ను జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని నోబెల్ క‌మిటీ బెలార‌స్ అధికారుల‌ను కోరింది. అలెస్ త‌న దేశం లో ప్ర‌జాస్వామ్యం, శాంతియుత అభివృద్ధిని ఎంతో ఆకాంక్షించారు. అందుకు ఎన‌లేని కృషి చేశార‌ని  నోబెల్  క‌మిటీ ప్రశంసించింది. 

అలెస్ 1996లో వియాస్నా(స్ప్రింగ్‌) అనే సంస్థ‌ను నెల‌కొల్పి జైళ్ల‌లో మ‌గ్గుతున్న అనేక‌మంది రాజ‌కీయ ఖైదీల ప‌రిస్థితుల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చారు. మాన‌వ‌హ‌క్కుల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని ప్ర‌భుత్వ విధానాల‌ను తీవ్రంగా ఖండించారు. 

ఉక్రెయిన్ సెంట‌ర్ ఫ‌ర్ సివిల్ లిబ‌ర్టీస్ సంస్థ ఆ దేశంలో ప్ర‌జాస్వామ్యం, మాన‌వ‌హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఏర్పాట‌యింది. అక్క‌డ పూర్తిస్థాయిలో ప్ర‌జాస్వామ్యం నెల కొనేందుకు ఎంతో పాటుప‌డింద‌ని నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. 2022 ఫిబ్ర‌వ‌రిలో ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి త‌ర్వాత ర‌ష్యా కుతంత్రాలు, దాడుల‌పై ప్ర‌త్యేకంగా డాక్యుమెంట్ రూపొందించ‌డంలో కీల‌క‌పాత్ర వ‌హిం చింది.  

అలాగే  1987లో ఆరంభ‌మ‌యిన మెమోరియ‌ల్ సంస్థ పాత సోవియ‌ట్ యూనియ‌న్‌లో క‌మ్యూనిస్టు పాల‌ కుల చేత అణ‌చివేత‌కు గుర‌యిన‌వారిని ర‌క్షించ‌డంలో వారి కోసం పాటుప‌డిన సంస్థగా ప్ర‌పంచ‌ స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా చెచెన్ యుద్దాల స‌మ‌యంలో, ర‌ష్యా, ర‌ష్యా మ‌ద్ద‌తు దారుల దాడులకు గుర‌యిన వారి ప‌రిస్థితులు, దేశం ఎదుర్కొన్న దుర్భ‌ర స్థితుల గురించి ఎంతో స‌మాచారం సేక‌రించి మాన‌వ‌హ‌క్కుల సంర‌క్ష‌ణ విష‌యంలో గొప్ప కృషి చేసిన గుర్తింపు పొందింది.  ఫ‌లితంగా, 2009 లో  ఈ మెమోరియ‌ల్ చెచెన్యా విభాగం అధ్య‌క్షుడు న‌లాలియా ఎస్టిమిరోవా హ‌త్య‌కు గుర‌య్యారు.