ఓటీఎస్ అట్టర్‌ఫ్లాప్‌.. వసూళ్ల స్కీం ఫసక్.. ప్రజాస్పందన తుస్‌స్‌స్‌..!

4 వేల కోట్ల ఓటీఎస్ లెక్క. స్పందన చూస్తే బొక్క. అందుకే, ఓటీఎస్ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఏదేదో అనుకుంటే.. ఇంకేదో జరుగుతోందంటూ జగనన్న దిగాలు పడుతున్నారు. మాట తప్పి.. మడిమ తిప్పి.. ఓటీఎస్ పేరుతో పేదలనే దోచుకోవాలని చూసిన జగన్ రెడ్డికి ప్రజలు దిమ్మతిరిగే ఝలక్ ఇస్తున్నారు. ఓటీఎస్ కట్టేదేలేదు... పో పొమ్మంటున్నారు. అధికారులు ఎంత ఒత్తిడి తెస్తున్నా.. ఎంతగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. జనాలు మాత్రం పదివేలు కాదుకదా.. పైసా కూడా కట్టమంటూ కమిటెడ్ గా ఉంటున్నారు.

గతంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు నిర్మించుకున్న నిరుపేదలకు ఫ్రీగా క్రమబద్ధీకరణ చేస్తానన్న ఏపీ సీఎం జగన్ మాట తప్పారు.. 100 చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న పేదలకు ఒక్క రూపాయికే క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి సర్కార్ దాన్ని ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)లా మార్చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం గూడు కట్టుకుని కాలం వెళ్లదీస్తున్న నిరుపేదల నుంచి కూడా కోట్లాది రూపాయలు కొట్టేయాలని ఓటీఎస్ పథకం తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటీఎస్ పథకం పేరు చెప్పి ఏపీలో ఏకంగా 4 వేల కోట్ల రూపాయలు కొట్టేయాలనే సర్కార్ కుటిల యత్నానికి నిరుపేదల నుంచి స్పందన రాకపోవడం గమనించాల్సిన అంశం. ‘వసూళ్ల’ పథకాన్ని ‘మేలు’ చేసే పథకంగా చూపించేందుకు వైసీపీ సర్కార్ ఎంతగానో యత్నించింది. అయితే అది మంచి పథకం కాదు.. ముంచే పథకం అని జనం పసిగట్టేసినట్టున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ గత డిసెంబర్ 21న ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఓటీఎస్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు వరకు 15.4 కోట్ల రూపాయలు క్రమబద్ధీకరణ ఫీజుగా నిరుపేదలు సమర్పించుకున్నారు. అయితే.. జగన్ సభ తర్వాత ఓటీఎస్ కు పూర్తిగా స్పందన తగ్గిపోయింది. సభ తర్వాత 20 రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు కేవలం 5 లక్షల రూపాయలు రాబట్టేందుకు గ్రామ స్థాయి నుంచీ అధికారులు కిందా మీదా పడి పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చింది. ఓటీఎస్ కు స్పందన ఎంతలా తగ్గిపోయిందో అర్థం చేసుకోవనికి ఈ గణాంకాలే నిదర్శనం. జగన్ సర్కార్ కుటిల యత్నంపై నిరుపేదలు నీళ్లు చల్లేశారు. ఓటీఎస్ వసూళ్లు తగ్గిపోవడంతో నిధులు ఇంకే విధంగా సమీకరించుకోవాలో అంతు చిక్కక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు.

అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో కాస్త గూడు కట్టుకున్న వారిని ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టాలని వెళుతున్న గ్రామస్థాయి అధికారులపై పలుచోట్ల నిరుపేదలు చిందులు తొక్కుతున్నారు. ఏనాడో తాళి కట్టి.. కాపురం చేసుకుంటున్న తన భార్యతో జగన్ సర్కార్ మళ్లీ పెళ్లి చేస్తానన్న చందంగా ఉందంటూ ఒక పెద్దాయన నిప్పులు చెరిగిన వైనం మీడియాలో వైరల్ అయింది. ఓటీఎస్ కట్టాలంటూ గ్రామ స్థాయిలో అధికారులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వృద్ధులు, వికలాంగులు అని కూడా చూడకుండా ఓటీఎస్ అంటూ నిరుపేదలను సతాయిస్తున్న సంఘటనలు ప్రతిరోజూ మీడియాలో వస్తున్నాయి. చివరికి ఓ వృద్ధురాలు అయితే.. ఓటీఎస్ కట్టాలంటూ ఇబ్బంది పెట్టిన అధికారులపై శివతాండవమే చేసింది. ‘ఎన్నికలకు ముందు ఓటీఎస్ విషయం చెప్పారా? వాడొచ్చి అడిగినా తాను ఇలాగే చెబుతా’ అంటూ ఆ వృద్ధురాలు నిప్పులు తొక్కడంలో  వాస్తవం ఉందనిపిస్తోంది.

ఓటీఎస్ తుస్ అనడానికి మరో రీజన్ కూడా ఉంది. జగన్ సభకు ముందు గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది పూర్తి స్థాయిలో విధుల్లో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను క్రమబద్ధీకరించడం లేదు సరికదా.. కనీసం ప్రొబేషన్ అయినా ప్రకటించకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఫిట్ మెంట్ ప్రకటించిన జగన్ రెడ్డి సర్కార్ తమను అస్సలు పట్టించుకోకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో ఓటీఎస్ డబ్బుల వసూలులో కీలక పాత్ర పోషించే గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కూడా ఓటీఎస్ తుస్సుమనడానికి కారణం అని విశ్లేషణలు వస్తున్నాయి.

జగన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీఓ 225 ప్రకారం డిమాండ్ నోటీసులు అందుకున్న నిరుపేదలు ఫీజులు కడితే ఖజానాకు దాదాపు 4 వేల కోట్లు వస్తాయనేది అధికారులు చెబుతున్న మాట. ఇలా పట్టణ శివారు ప్రాంతాలు, మురికివాడలు, సుదూర ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి డిమాండ్ నోటీసులు పంపింది. ఉచిత క్రమబద్ధీకరణ అర్హతను 100 చదరపు గజాల నుంచి 75 చదరపు గజాలకు తగ్గించేసి ఫ్రీ రెగ్యులేషన్ జాబితాలోకి వేలాది మందికి ఛాన్స్ లేకుండా చేయడం జగన్ సర్కార్ కే చెల్లిందనే విమర్శలు రావడం గమనార్హం. ఉచిత క్రమబద్ధీకరణ జాబితాలోకి రాని వారంతా స్థానిక మార్కెట్ రేట్ ప్రకారమే ఫీజు చెల్లించాలని వైసీపీ సర్కార్ పెట్టిన కండిషన్ ఎందరో నిరుపేదలకు తలకు మించిన భారంగా మారింది.

ఓటీఎస్ ఫీజుల నెపంతో నిరుపేదల నుంచి కూడా నిధులు పిండేయాలన్న వైసీపీ సర్కార్ కుటిలయత్నానికి పెద్ద గండే పడడానికి మరో కారణం కూడా ఉంది. పేదల వద్ద లక్షలాది రూపాయలే ఉంటే ప్రభుత్వ భూముల్లో ఎందుకు గూడుకట్టుకుంటారు? ఓటీఎస్ పేరుతో నిరుపేదల్ని సర్కార్ సతాయిస్తే.. లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారనే ప్రాథమిక అవగాహన కూడా ఈ సర్కార్ కు లేదా? అని పలువురు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓటీఎస్ అమలయ్యే పనేనా? అనే పెద్ద ప్రశ్న తెర మీదకు వస్తోంది.