ఆ డీప్‌ఫేక్ వీడియోలు తొలగించండి.. మెటా, గూగుల్, ఎక్స్‌లకు బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు

posted on: Aug 5, 2026 4:05PM

సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రముఖుల ప్రతిష్టను దిగజార్చే కుట్రలు కూడా అంతే స్థాయిలో విస్తరిస్తున్నాయి.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని కొందరు సృష్టించిన డీప్ ఫేక్ వీడియోలు, కల్పిత ఆరోపణల వ్యవహారం వివాదాస్పదమైంది.  దీనిపై తీవ్రంగా స్పందించిన బాంబే హైకోర్టు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న గడ్కరీ డీప్ ఫేక్ వీడియోలు,  అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. 

దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానంఅమలులోకి వచ్చినప్పటి నుంచి దీనిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని..  మంత్రి నితిన్ గడ్కరీ,  ఆయన కుటుంబం ఆర్థికంగా భారీగా లబ్ధి పొందుతోందంటూ సామాజిక మాధ్యమాలలో  ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా  ఏఐతో తయారు చేసిన డీప్‌ఫేక్ వీడియోలతో ఆయన ప్రతిష్టకు  భంగం కలిగిలా  డిజిటల్ మాధ్యయాలో పోస్టులు వైరల్ అయ్యాయి.  దీనిపై  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇథనాల్ ఇంధన విధానం అనేది కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, దానికి తన రవాణా మంత్రిత్వ శాఖతో గానీ లేదా వ్యక్తిగతంగా తన కుటుంబంతో గానీ ఎలాంటి రకమైన ఆర్థిక సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన, తన కుటుంబం  పరువు తీయడమే లక్ష్యంగా కుట్రపూరితంగా ఈ పోస్టులు చేశారని పేర్కొంటూ, తన పరువుకు కలిగిన భంగానికి గాను   11 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ  కోర్టును ఆశ్రయించారు.

గడ్కరీ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను ' నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.   దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్ (యూట్యూబ్), ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు  గడ్కరీకి వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్న అన్ని ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, వ్యాఖ్యలు, ఫోర్జరీ పోస్టులను తక్షణమే  శ్వతంగా తొలగించాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ముంబై హైకోర్టు  సోషల్ మీడియా దిగ్గజాలనుద్దేశిస్తూ.. సమాజంలో లేదా రాజకీయాల్లో ఉన్న ప్రముఖులు, సాధారణ పౌరులు తమ పరువును కాపాడుకోవడానికి ప్రతిసారీ కోర్టు తలుపు తట్టాలా అని ప్రశ్నించింది. ఇలాంటి పరువు నష్టం కలిగించే అభ్యంతరకర కంటెంట్‌ను, డీప్‌ఫేక్ వీడియోలను ప్లాట్‌ఫామ్‌లు తమంతట తామే స్వచ్ఛందంగా గుర్తించి తొలగించేలా ఏదైనా మెకానిజం ఉందా అని నిలదీసింది.  

Nitin Gadkari, Bombay High Court, Deepfake Videos, E20 Ethanol Fuel, Meta Google X, Social Media Defamation

google-ad-img
    Related Sigment News
    • Loading...