బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్

 బీహార్ సీఎంగా నితీష్ కుమార్ బుధవారం ( ఆగస్టు 10) ప్రమాణ స్వీకారం.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండానే 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేతృత్వంలో బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.

పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నితీష్ తో పాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎనిమిదోసారి.  రెండేళ్ల కిందట బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో నితీష్ నేతృత్వంలోని జేడీయూ కేవలం 43 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.

245 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ  75 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 74 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122. 74 స్థానాలలో విజయం సాధించిన బీజేపీ నితీష్ నేతృత్వంలోని జేడీయూకు మద్దతు ఇచ్చింది.

దాంతో నితీష్ ముఖ్యమంత్రిగా బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. అయతే ఈ ఏడాది ఆరంభంలో బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు పొడసూపాయి. అవి పెరిగి పెద్దవై చివరికి నితీష్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేయడానికి కారణమయ్యాయి. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.