తెలుగు రాష్ట్రాల హైకోర్టుల‌కు కొత్త సీజేలు..

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల‌కు కొత్త ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల నియామ‌కం జ‌రగ‌నుంది. ఆంధ్రప్రదేశ్ సీజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ కానున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను.. ఆంధ్రప్రదేశ్ సీజేగా నియ‌మించ‌నున్నారు. 

అటు తెలంగాణ హైకోర్టుకు సైతం కొత్త‌ ప్రధాన న్యాయమూర్తిని నియ‌మించనున్నారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మను తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ చేయ‌నున్నారు. ఆ మేర‌కు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. 

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెళ్లారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్‌ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచించింది.  

రెండు తెలుగురాష్ట్రాల‌కు ఒకేసారి ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను మార్చి కొత్త వారిని నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రం.