పాత మిత్రులతో కొత్త పోత్తులు ?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయం కొంచెం చాలా భిన్నంగా ఉంటుంది. రాజకీయ మీడియా సబంధాలు కుడా అంతే. అయిన దానికి  కాని దానికి మీడియా సందడి కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో తోక అంటే, అదిగో  పులి అనే ప్రచారం క్షణాల్లో రెండు రాష్ట్రాలను చుట్టేస్తుంది. అందుకే మీడియా కథనాలలో ఏది నిజం, ఏది కాదు? అనే విషయంలో ప్రజల్లో   అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగని మీడియా ప్రసారం చేసే ప్రతి కథనం కట్టు కథే అనుకోవలసిన అవసరం లేదు.  

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సుదీర్ఘ విరామం తర్వాత, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఆజాదీకా అమృత మహోత్సవ కార్యక్రమానికి సంబందించి ప్రధాని సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు ఒకరినొకరు పలకరించు కున్నారు. కొద్ది సేపు మాట్లాడుకున్నారు. నిజానికి అందులో విశేషం లేదు, అనుకోవచ్చును  కానీ, వుంది.  నిజమే, కారాణాలు ఏవైనా, ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కాక పోయినా, ఇద్దరి మధ్య దూరం అయితే వుంది. గత నాలుగు సంవత్సరాలలో ఒకరి నొకరు కలిసింది లేదు, మాట్లాడుకున్నదీ లేదు. సో, ఆవిధంగా ఆ ఇద్దరు ఏమి మాటలాడుకున్నారు, అనేది పక్కన పెట్టినా, ఆ ఇద్దరూ .. మాట్లాడుకున్నారు అనేదే, మంచి హెడ్లైన్ అవుతుంది. అయింది కూడా.

ఒకప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య  సంబధాలు చక్కగా ఉన్న ఆ రోజుల్లో, అద్వానీ మొదలు మోడీ వరకు అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు,చంద్రబాబును విశ్వసనీయ మిత్రుడుగా అభివర్ణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే, తెలుగు దేశం పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా, ప్రధాని మోడీ, చంద్రబాబును కానీ, తెలుగు దేశం పార్టీని గానీ టార్గెట్ చేసిన సందర్భాలు పెద్దగా లేవు. నిజానికి, 2019 ఎన్నికలుకు ముందు తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి, ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంలో కూడా మోడీ, తెలుగు దేశం పార్టీని అంతగా టార్గెట్ చేయలేదు, జగన్మోహన్ విసిరిన ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారని, మిత్ర ధర్మంగా హెచ్చరిక మాత్రమే చేశారు. రాజకీయ శత్రువుగా చూడలేదు.

గడచిన నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో, దేశం రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు, రాజకీయ వాతారణం మారిపోయినా, రాష్ట్రంలో  బీజేపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు విమర్శిం చుకున్నా,  ఒక్క మోడీనే కాదు, జాతీయ నాయకులూ ఎవరూ కూడా డైరెక్ట్ గా చంద్రబాబును టార్గెట్ చేసిన సందర్భాలు అంతగా లేవు. అలాగని, ఇద్దరి మధ్య గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ, అవసరం అయితే మళ్ళీ చేతులు కలిపే అవకాశమే లేదనే పరిస్థితులు అయితే లేవు. అయితే, ఇప్పుడు లాంటి అవసరం వచ్చిందా, అవకాశం ఏర్పడిందా అంటే, అవునననే అనవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అవును రాజకీయాల్లో శాశ్వత  అవసరాలే కానీ, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచక, అకృత్య పాలన అంతమొందించేందుకు, బీజేపీ, జనసేన కుటమితో పొత్తును కోరుకుంటోంది. ఇందులో దాపరికం లేదు,. మరోవంక  గడచిన   రెండు మూడు సంవత్సరాలలో బీజేపీ  కీలక మిత్రపక్షాలు అన్నీ, ఎన్డీఏ నుంచి వెళ్లి పోయాయి. తాజాగా, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయు) కూడా ఎన్డీఎ గూడు విడిచింది.  నిజమే, సంఖ్యా పరంగా చూసుకుంటే, మిత్రపక్షాలు వెళ్ళిపోయినా బీజేపీకి వచ్చిన నష్టం లేదు. బీజేపీకి సొంతంగానే, లోక్ సభలో కావలసిన సంఖ్యా బాలం వుంది. రాజ్యసభలోనూ కొంచెం అటూ ఇటుగా బీజేపీ సంఖ్యా బలం  మూడంకెల  సంఖ్యకు చేరుకుంది. లోపలి నుంచి బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు ఎటూ ఉండనే ఉన్నాయి. మొన్నటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ విషయం తేలిపోయింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులలో, ఓటు హక్కు  వినియోగించుకున్న700 మంది ఎంపీలలో 528 మంది (74.37 శాతం) బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్ కర్కు ఓటేస్తే, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ మార్గరెట్ అల్వాకు కేవల 182 మంది ( 25.63) శాతం మంది మాత్రమే ఓటేశారు.

సో సంఖ్యా పరంగా చూసుకుంటే, మిత్రపక్షాలు శత్రు కూటమిలో చేరినా, బీజేపీ, ఎన్డీఎకు వచ్చే తక్షణ ముప్పు ఏమీ లేదు. కానీ, మిత్రులంతా వెళ్లి పోయారు, ఎన్డీఏ ఖాళీ అయింది అంటే, ప్రజల్లో పార్టీ ప్రతిష్ట కొంత మేర దిగజారే ప్రమాదం ఉంటుంది. అందుకే, బీజేపీ, మళ్ళీ పాత మిత్రులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందని, అందులో భాగంగానే, మోడీ మాజీ విశ్వసనీయ మిత్రుడు చంద్రబాబుతో ముచ్చట్లు మోదలు పెట్టారని అంటున్నారు.అయితే, ఇప్పటి కిప్పుడు మూడు ముళ్ళు పడిపోతాయని కాదు, కానీ, అటూ ఇటూ అన్నీ ఓకే అయితే, ఓ శుభ ముహూర్తాన పెళ్లి బాజాలు ... వినిపించినా వినిపిస్తాయి.